Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : అనుభవించు రాజా

By:  Tupaki Desk   |   26 Nov 2021 9:59 AM GMT
మూవీ రివ్యూ : అనుభవించు రాజా
X
చిత్రం : ‘అనుభవించు రాజా’

నటీనటులు: రాజ్ తరుణ్-ఖశిష్ ఖాన్-అజయ్-నరేన్-సుదర్శన్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
రచన-దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి

సరైన హిట్టు కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్ ఇప్పుడు ‘అనుభవించు రాజా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద బేనర్లో.. శ్రీను గవిరెడ్డి రూపొందించిన చిత్రమిది. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రాజు (రాజ్ తరుణ్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఐతే చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల రాజు కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుకుని అతడితో ప్రేమలో పడుతుంది శ్రావణి (రాజు). కానీ అతను సెక్యూరిటీ గార్డ్ అని తెలిసి కొన్ని రోజులు దూరంగా ఉన్నప్పటికీ.. తర్వాత అతడి మంచి మనసును అర్థం చేసుకుని దగ్గరవుతుంది. ఆ సమయంలోనే రాజు మీద ఒక రౌడీ గ్యాంగ్ దాడి చేస్తుంది. వాళ్ల నుంచి రాజు తప్పించుకున్నాక.. తనను చంపడానికి రాజే స్వయంగా రౌడీ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చాడని అతడి స్నేహితుడికి, శ్రావణికి తెలుస్తుంది. అప్పుడే తన గతం గురించి చెప్పడం మొదలు పెడతాడు రాజు. ఊర్లో దర్జాగా బతుకుతున్న అతను సిటీకి వచ్చి ఇలా సెక్యూరిటీ గార్డుగా ఎందుకు పని చేస్తున్నాడు.. తనను చంపించడానికి ఎందుకు సుపారీ ఇచ్చాడు.. చివరికి అతడి జీవితం ఏ మలుపు తిరిగింది.. అన్న విషయాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

‘అనుభవించు రాజా’ దర్శకుడు శ్రీను గవిరెడ్డి ఇంతకుముందు రాజ్ తరుణ్ తోనే ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే సినిమా తీశాడు. అప్పుడు ఇప్పుడు అతను గ్రామీణ నేపథ్యంలోని కథనే ఎంచుకున్నాడు. తొలి సినిమాలో హీరో మామూలు కుర్రాడైతే.. ఇందులో జల్సా రాయుడు. తొలి సినిమాలో మిగతా విషయాలు ఎలా ఉన్నా.. కనీసం సెకండాఫ్ అంతా క్రికెట్ మ్యాచ్ చుట్టూ తిరుగుతూ యూత్ కనెక్టయ్యే ఎంటర్టైన్మెంట్ అయినా ఉండటంతో కాస్త టైంపాస్ అయినా అవుతుంది. కానీ ఈసారి ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ కూడా స్కోప్ లేని.. ఒక మామూలు కథను ఎంచుకున్నాడతను. ‘అనుభవించు రాజా’ అనే టైటిల్ చూసి.. జల్సా రాయుడిగా హీరో గెటప్ అదీ చూసి.. మంచి మసాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆశిస్తే.. ఈ కథలో అస్సలు అతకని క్రైమ్ డ్రామాతో ముడిపెట్టి సినిమాను ఎటో తీసుకుపోయాడు దర్శకుడు శ్రీను గవిరెడ్డి. ఓటీటీల్లో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్లు చూస్తున్న ఈ తరం ప్రేక్షకులకు ఇందులోని క్రైమ్ డ్రామా థ్రిల్ ఇవ్వకపోగా సిల్లీగా అనిపిస్తే అందులో వారి తప్పేమీ లేదు. ఇటు ఎంటర్టైన్మెంట్ పండగా.. అటు క్రైమ్ డ్రామా థ్రిల్ ఇవ్వక ‘అనుభవించు రాజా’ రెంటికీ చెడ్డట్లు తయారైంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో సినిమా అంటే కథ పరంగా ఎంతో కొత్త కొత్తదనం ఆశిస్తాం. పైగా తొలి సినిమాతో ఎదురు దెబ్బ తిన్న శ్రీను గవిరెడ్డి చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా అంటే కథ పరంగా బాగా కసరత్తు చేసి ఉంటాడని అనుకుంటాం. కానీ ఆ ఆశలన్నీ నీరుగారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే హీరో హీరోయిన్ దగ్గర తాను ‘సెక్యూరిటీ’ అని చెబితే.. ఆమె సిస్టమ్ సెక్యూరిటీ మీద పని చేసే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుకుని అతడితో స్నేహం చేయడం.. వీళ్లు తరచుగా కలుస్తున్నా సరే హీరో గురించి నిజం తెలియకుండా అతడితో ఆమె ప్రేమలో పడిపోవడం చూస్తే ఈ సినిమాను ఎంత సీరియస్ గా తీసుకోవాలో అర్థమైపోతుంది. చాలా సాధారణమైన సన్నివేశాలతో.. అస్సలు ఫీల్ లేకుండా సాగిపోయే ఈ ప్రేమకథతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు. కాస్తో కూస్తో సుదర్శన్ కామెడీ మాత్రం ప్రథమార్ధంలో కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఈ సాదాసీదా లవ్ ట్రాక్ తర్వాత హీరో తన మీద తనే హత్యాయత్నం చేయించుకున్నాడన్న ట్విస్టుతో ఇంటర్వెల్ దగ్గర సినిమా మీద కాస్త ఆసక్తి రేకెత్తుతుంది.

ద్వితీయార్ధంలో కథ గ్రామానికి మళ్లుతుంది. అక్కడ బంగారం పాత్రలో రాజ్ తరుణ్ కాస్త హడావుడి చేయడానికి ప్రయత్నించాడు. కోడి పందాలు.. రొయ్యల చెరువుల నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో కొత్తదనం అయితే ఏమీ కనిపించదు. మనుషులు.. అనుబంధాల విలువ తెలియని వాడిగా హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టిన సన్నివేశాల్లో పస లేదు. గ్రామీణ నేపథ్యంలో ప్రధానంగా కామెడీ ఆశిస్తే.. దాన్నుంచి పక్కకు వెళ్లిపోయి క్రైమ్ డ్రామాను తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. చేయని నేరానికి ఊర్లో అందరూ హీరోను అపార్థం చేసుకోవడం.. ఆ ‘నేరం’ తాలూకు రహస్యాన్ని ఛేదించడానికి హీరో సిటీకి రావడం.. అక్కడ అసలు నిందితుల్ని పట్టుకోవడం.. ఈ థ్రెడ్ అంతా చాలా పాతగా అనిపిస్తుంది. ఈ కథలో అసలీ క్రైమ్ డ్రామా సింక్ అవ్వలేదు. అసలు నిందితుడెవరో తెలిసే సన్నివేశం కూడా తేలిపోయింది. క్లైమాక్స్ మరీ హడావుడిగా అనిపిస్తుంది. కథ పాతదైనా ఎంటర్టైన్మెంట్ వర్కవుట్ అయితే సినిమా పాసైపోయేది కానీ.. ‘అనుభవించు రాజా’ ఆ విషయంలో విఫలమైంది. ఏ వర్గం ప్రేక్షకులూ ఈ సినిమాతో సంతృప్తి చెందే అవకాశం లేకపోయింది.

నటీనటులు:

రాజ్ తరుణ్ పల్లెటూరిలో జల్సాలు చేసే బంగారం పాత్రలో కాసేపు సందడి చేశాడు. సిటీలో సెక్యూరిటీ గార్డు పాత్రలో అతను సాధారణంగా కనిపించాడు. నటన పరంగా రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంత ఏమీ లేదు. హీరోయిన్ ఖశిష్ ఖాన్ మామూలుగా అనిపిస్తుంది. అందం.. అభినయం రెండింట్లోనూ ఆమెకు యావరేజ్ మార్కులే పడతాయి. సుదర్శన్ అక్కడక్కడా కొంచెం నవ్వులు పంచాడు. అతడి పాత్ర ద్వితీయార్ధంలోనూ ఉంటే బాగుండేదనిపిస్తుంది. తమిళ నటుడు నరేన్.. అజయ్ బాగానే చేశారు. సుపారీ కిల్లర్ పాత్రలో కనిపించిన నటుడు ఓకే.

సాంకేతిక వర్గం:

గోపీసుందర్ ఈ తరహా సినిమాలకు అంతగా సెట్టవ్వడనిపిిస్తుంది తన పాటలు.. నేపథ్య సంగీతం వింటే. సినిమా నడతకు తగ్గట్లుగా మాస్ మ్యూజిక్ ఇవ్వడంలో గోపీ విఫలమయ్యాడు. టైటిల్ సాంగ్ మినహా ఏదీ అంతగా ఆకట్టుకోదు. నేపథ్య సంగీతం కూడా మామూలుగా సాగిపోయింది. నగేష్ బానెల్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కొత్త ఆలోచనలేమీ అతడి దగ్గర లేనట్లున్నాయి. అతను ఎంచుకుంటున్న కథలు మరీ పాతగా ఉంటున్నాయి. 90వ దశకంలో ఇలాంటివి వర్కవుట్ అయ్యేవి. తొలి చిత్రంలో ‘క్రికెటైన్మెంట్’ అయినా ఇచ్చాడు కానీ.. ఈ చిత్రంలో యూత్ కనెక్టయ్యే అంశాలేవీ లేకపోయాయి. కథే పాతదంటే.. స్క్రీన్ ప్లేతోనూ అతనేమీ మ్యాజిక్ చేయలేకపోయాడు.

చివరగా: అనుభవించడానికేం లేదు రాజా

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre