Begin typing your search above and press return to search.

IFFI జ్యూరీ హెడ్ పై విరుచుకుపడ్డ 'ది కాశ్మీర్ ఫైల్స్‌' బృందం

By:  Tupaki Desk   |   29 Nov 2022 12:39 PM GMT
IFFI జ్యూరీ హెడ్ పై విరుచుకుపడ్డ ది కాశ్మీర్ ఫైల్స్‌ బృందం
X
ఈ సంవత్సరం 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ 2022లో విడుదలైన కొన్ని ప్రముఖ బాలీవుడ్ చిత్రాలను ప్రీమియర్ గా ప్రదర్శించిన‌ సంగతి తెలిసిందే. 2022లో చెప్పుకోదగ్గ చిత్రాల విషయానికి వస్తే.. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ పుర‌స్కారం ద‌క్కించుకోక‌పోగా వివాదంలోకి వ‌చ్చింది. IFFI జ్యూరీ హెడ్‌లలో ఒకరైన ఇజ్రాయెలీ ఫిలింమేక‌ర్ నాదవ్ లాపిడ్ ఈ చిత్రాన్ని ``ప్రచార స్టంట్ .. అసభ్యకరమైనది`` అని కామెంట్ చేయ‌డం ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది.

ఈవెంట్ నుండి అతని వీడియో వైరల్ అయిన కొన్ని గంటల తర్వాత `ది కాశ్మీర్ ఫైల్స్` నటులు అనుపమ్ ఖేర్ - దర్శన్ కుమార్ దీనిపై స్పందించారు. ఇది అసభ్యకరమైన చిత్రం అని వ్యాఖ్యానించినందుకు అనుపమ్ ఖేర్ IFFI జ్యూరీ హెడ్ ని తప్పుబట్టారు. దర్శన్ కుమార్ కూడా ఘాటుగా స్పందించారు

ది కాశ్మీర్ ఫైల్స్ పై నవేద్ లాపిడ్ చేసిన వ్యాఖ్యపై కౌంట‌ర్ వేస్తూ.. అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఒక పోస్ట్ ను పంచుకున్నారు. కొన్ని మూవీ ఫోటోల‌ను షేర్ చేసి అతని స్టిల్ తో పాటు `ది షిండ్లర్స్ లిస్ట్` (హాలీవుడ్ మూవీ) అధికారిక ముఖచిత్రం కూడా షేర్ చేసారు. హిందీలో అనుప‌మ్ ఇలా రాసారు. ``అబద్ధం ఎంత ఎత్తులో ఉన్నా... నిజం ముందు అది చిన్నదే`` అంటూ అనుప‌మ్ ఖేర్ వ్యాఖ్యానించిన‌ వెంటనే నెటిజనుల్లోని ఒక విభాగం తమ మద్దతును అందించింది.

1993లో విడుదలైన షిండ్లర్స్ లిస్ట్ (విదేశీ మూవీ).. దాదాపు వెయ్యి మందికి పైగా పోలిష్-యూదు శరణార్థులను హోలోకాస్ట్ నుండి రక్షించిన జర్మన్ పారిశ్రామికవేత్త క‌థ చుట్టూ తిరుగుతుంది. అదే కోవ‌కు చెందిన చిత్రం కాశ్మీర్ ఫైల్స్ అనే అర్థం వ‌చ్చేలా ఖేర్ వ్యాఖ్యానించారు. దర్శన్ కుమార్ కూడా IFFI జ్యూరీ సభ్యుని వ్యాఖ్యపై తన నిరాశను వ్యక్తం చేశారు. తాజా ఇంటర్వ్యూలో కుమార్ ఇలా అన్నాడు. ``ప్రతి ఒక్కరూ తాము చూసే వాటి నుంచి గ్రహించిన సంగ‌తుల‌పై వారి సొంత‌ అభిప్రాయాలను కలిగి ఉంటారు.

కానీ కాశ్మీర్ ఫైల్స్ అనేది ఉగ్రవాదం తాలూకా క్రూరమైన చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్న కాశ్మీరీ పండిట్ సమాజం వాస్తవ దుస్థితిని చిత్రించిన చిత్రం అనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కాబట్టి ఈ సినిమా వల్గారిటీ ఆధారంగా కాకుండా వాస్తవికత ఆధారంగా రూపొందించిన‌ది`` అని అన్నారు.

ఇఫీ ముగింపు ఉత్స‌వ‌ కార్యక్రమంలో నాదవ్ లాపిడ్ తన ప్రసంగంలో ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూసి క‌ల‌వ‌ర‌ప‌డ్డాన‌ని అన్నారు. “కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి మనమంతా కలవరపడ్డాం. షాక్ అయ్యాము. అటువంటి ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవంలో కళాత్మకమైన పోటీతత్వ విభాగానికి ఇది తగని సినిమా.. ఇది ప్రచార.. అసభ్యకరమైన చిత్రంగా మాకు అనిపించింది. విమ‌ర్శ‌ల‌ను మంచి మ‌న‌సుతో స్వీక‌రించాలి`` అని అన్నారు. అత‌డి వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా ది కాశ్మీర్ ఫైల్స్ బృందం ధీటుగా స్పందిస్తోంది. నెటిజ‌నుల నుంచి మ‌ద్ధ‌తు ల‌భిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.