Begin typing your search above and press return to search.

ఇద్దరు హీరోయిన్లు.. రెండు హ్యాట్రిక్స్

By:  Tupaki Desk   |   7 July 2018 8:30 AM GMT
ఇద్దరు హీరోయిన్లు.. రెండు హ్యాట్రిక్స్
X
కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలతో దూసుకెళ్లిన ఇద్దరు అందాల భామలకు ఇప్పుడు ఊహించని కష్టాలొచ్చాయి. వరుస ఫ్లాపులతో ఇద్దరూ సతమతం అయిపోతున్నారు. ఆ హీరోయిన్లే.. అనుపమ పరమేశ్వరన్-మెహ్రీన్ కౌర్. మలయాళ ‘ప్రేమమ్’తో కథానాయికగా పరిచయమై.. ‘అఆ’ లాంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన అనుపమ.. ఆ తర్వాత కూడా వరుస విజయాలతో దూసుకెళ్లింది. ‘ప్రేమమ్’.. ‘శతమానం భవతి’ ఆమె కెరీర్ కు మంచి ఊపునిచ్చాయి. కానీ ఆ తర్వాత అనుపమ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.

గత ఏడాది ‘ఉన్నది ఒకటే జిందగీ’తో అనుపమకు తొలి పంచ్ పడింది. ఆ సినిమాలో అనుపమ నటనకు మంచి పేరొచ్చినా సినిమా సరిగా ఆడలేదు. ఇక కొత్త ఏడాదిలో నాని చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ తుస్సుమనిపించింది. తాజాగా సాయిధరమ్ తేజ్ తో నటించిన ‘తేజ్ ఐ లవ్యూ’పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే దానికి నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక ఆమె ఆశలన్నీ రామ్ సరసన నటిస్తున్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ మీద ఉన్నాయి. అదేమవుతుందో చూడాలి.

మరోవైపు మెహ్రీన్ కౌర్ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి హిట్ మూవీతో పరిచయం అయింది. తర్వాత గ్యాప్ వచ్చినప్పటికీ ‘మహానుభావుడు’.. ‘రాజా ది గ్రేట్’ హిట్టయి హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు తెచ్చాయి. కానీ ఆపై ఆమె కెరీర్ గాడి తప్పింది. ‘కేరాఫ్ సూర్య’.. ‘జవాన్’ తేలిపోయాయి. ఇప్పుడు ‘పంతం’ సినిమా నెగెటివ్ టాక్ తో మొదలైంది. మొత్తానికి అటు అనుపమ.. ఇటు మెహ్రీన్.. ఇద్దరి కెరీర్లు కూడా ఒకేలా సాగుతున్నాయి. ముందు హ్యాట్రిక్ విజయాలందుకున్నారు. తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. వీళ్లిద్దరి తాజా సినిమాలు ఒకే వారాంతంలో విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. మరి మున్ముందు వీరి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.