Begin typing your search above and press return to search.

అనుపమకు ఫ్లాట్ అయిపోయారే..

By:  Tupaki Desk   |   29 Oct 2017 4:48 PM IST
అనుపమకు ఫ్లాట్ అయిపోయారే..
X
సినిమా సినిమాకూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లోకి చొచ్చుకెళ్లిపోతోంది అనుపమ పరమేశ్వరన్. ఈ ఏడాది ఆరంభంలో ‘శతమానం భవతి’తో తెలుగు కుర్రాళ్లను బాగా డిస్టర్బ్ చేసింది ఈ మలయాళ అమ్మాయి. ఇప్పుడు ‘ఉన్నది ఒకటే జిందగీ’లో మహా పాత్రతో ఆమె మరింతగా నచ్చేసింది మన ప్రేక్షకులకు. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోదగ్గ అంశాల్లో అనుపమ కూడా ఉందనడంలో సందేహం లేదు.

ఇప్పటిదాకా అనుపమ బాగానే నటిస్తూ వచ్చింది కానీ.. ఆమె చాలా మంచి నటి అనిపించుకున్నదేమీ లేదు. ‘అఆ’.. ‘ప్రేమమ్’ సినిమాల్లో ఆమెవి చిన్న పాత్రలు. ‘శతమానం భవతి’లో నటన కంటే ఆమె అందమే అందరినీ ఎక్కువ ఆకట్టుకుంది. ఐతే ఇప్పుడు ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో ఇటు అందంతో.. అటు నటనతో కట్టిపడేసింది అనుపమ. తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న అనుపమ.. పట్టి పట్టి మాట్లాడటం కాకుండా తెలుగమ్మాయిలా చక్కగా డైలాగులు పలికింది. నటన కూడా సహజంగా సాగింది. పాత్రకు తగ్గ పరిణతిని ఆమె చూపించింది.

ట్రెడిషనల్ డ్రెస్సింగ్ లో అచ్చమైన తెలుగుమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. మొత్తంగా ఈ సినిమాలో అనుపమ పూర్తి స్థాయిలో మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. అంతిమంగా ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఫలితం ఏంటన్నది తెలియాల్సి ఉంది. కానీ అనుపమకు మాత్రం ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అనుపమ కెరీర్ తర్వాతి స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు.