Begin typing your search above and press return to search.

పాన్ ఇండియాపై డైరెక్ట‌ర్ లో ఎందుకింత‌ అస‌హ‌నం!

By:  Tupaki Desk   |   12 Dec 2022 2:30 AM GMT
పాన్ ఇండియాపై డైరెక్ట‌ర్ లో ఎందుకింత‌ అస‌హ‌నం!
X
ఇటీవలి కాలంలో పాన్ ఇండియా ఆలోచ‌న‌ గేమ్ ఛేంజ‌ర్ గా మారిన సంగ‌తి తెలిసిందే. బాహుబలి: ది బిగినింగ్- బాహుబలి: ది కన్ క్లూజన్ సినిమాల ఘ‌న‌విజయంతో ఇది మొద‌లైంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి దీనికి ఆద్యుడు. బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత అన్న చందంగా ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ మారాయి. ఇటీవ‌ల‌ పుష్ప: ది రైజ్- RRR- KGF: చాప్టర్ 2 -కార్తికేయ 2- కాంతార వంటి సౌత్ సినిమాలు పాన్-ఇండియా హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇవ‌న్నీ ఉత్త‌రాదిన బంప‌ర్ హిట్లుగా నిల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు సౌత్ నుంచి నార్త్ పై ఇది ఒక త‌ర‌హా దండ‌యాత్ర‌గా విశ్లేష‌ణ మొద‌లైంది. చాలా మంది ముంబై ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు సినీపెద్ద‌లు జీర్ణించుకోలేనిదిగా కూడా ఈ వ్య‌వ‌హారం మారింది.

ఈ ప్ర‌క్రియ‌ ప్రారంభ‌మైన‌ప్పటి నుండి చాలా సినిమాల విడుదలకు ముందే 'పాన్-ఇండియా సినిమాలు'గా ప్రచారంలోకి వ‌చ్చాయి. ఇదంతా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల స్టంట్ గా మారింది. ఓవైపు సౌత్ హ‌వా ఉత్త‌రాదిన పెర‌గ‌డం బాగానే ఉన్నా కానీ దీనిని మిస్ యూజ్ చేయ‌డంపై కొంద‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్యప్ త‌న‌లోని వ్య‌తిరేక‌త‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇప్పుడు పాన్-ఇండియా అనే దృగ్విషయంతో మనం ఎక్కువగా నిమగ్నమైతే అది మనల్ని ఎక్కడికో తీసుకెళుతుంద‌ని ఆయ‌న‌ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు.

తాజాగా ఓ సంభాషణలో అనురాగ్ కశ్యప్ ఇలా అన్నారు. ''పాన్-ఇండియాతో ప్రస్తుతం జరుగుతున్నది ప‌రిశీలిస్తే.. ప్రతి ఒక్కరూ పాన్-ఇండియా ఫిల్మ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో విజయం 5-10 శాత‌మే ఉంటుంది.

కాంతార- పుష్ప వంటి సినిమాలు బయటికి వెళ్లి కథలు చెప్పుకునే ధైర్యాన్నిస్తాయి. కానీ KGF 2 లాంటి సినిమాని మ‌ళ్లీ ప్రయత్నించి లేదా అనుకరించి ప్రాజెక్ట్ ను సెట్ చేయాల‌నుకుంటే భారీ ఫెయిల్యూర్ ని ఎదుర్కొంటారు'' అని విశ్లేషించాడు. ''అది(పాన్ ఇండియా బంధం) బాలీవుడ్ ను నాశనం చేసే బంధం... ప‌రిశ్ర‌మ‌కు ధైర్యాన్నిచ్చే చిత్రాలను వెతకాలి..'' అని త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

సంచల‌నాల మ‌రాఠా చిత్రం 'సైరత్' గురించి అనురాగ్ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్థావించ‌డం గ‌మ‌నార్హం. సైరత్ పాన్-ఇండియా విజయం సాధించిన ఏకైక మరాఠీ చిత్రం. కానీ ఇది వాస్తవానికి మరాఠీ సినిమాను ''నాశనం'' చేసిందని కశ్యప్ అభిప్రాయపడ్డారు.

''నేను సైరత్ ద‌ర్శ‌కుడు నాగరాజుతో మాట్లాడాను. సైరత్ మరాఠీ సినిమాను నాశనం చేసింది. ఎందుకంటే అకస్మాత్తుగా ప‌రిశ్ర‌మ‌ ప్రజలు ఇంతగా డబ్బు సంపాదించే అవకాశం ఉందని గ్రహించారు కాబట్టి వారు మునుప‌టిలా (అంతకుముందు తీస్తున్నవి) తీయడం మానేశారు. ప్రతి ఒక్కరూ సైరత్ ను అనుకరించాలని కోరుకున్నారు'' అని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు.

మొత్తానికి పాన్ ఇండియా మైండ్ సెట్ ఫిలింమేక‌ర్స్ ని మార్చేసింద‌ని వారిని త‌ప్పుదారి ప‌ట్టించింద‌ని అనురాగ్ త‌న‌లోని సంఘ‌ర్ష‌ణ‌ను బ‌య‌ట‌పెట్టారు. పాన్ ఇండియా ట్యాగ్ ను కొంద‌రు త‌ప్పుడు విధానంలో ఉప‌యోగించుకుంటున్నార‌ని కూడా అనురాగ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాప్సీ పన్ను నటించిన థ్రిల్లర్ 'దొబారా' రూపంలో అనురాగ్ ఈ సంవత్సరం యావ‌రేజ్ హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.