Begin typing your search above and press return to search.

అనుష్క వ‌దులుకున్న అర‌డ‌జ‌ను క్రేజీ ఆఫ‌ర్లు

By:  Tupaki Desk   |   27 March 2021 11:30 PM GMT
అనుష్క వ‌దులుకున్న అర‌డ‌జ‌ను క్రేజీ ఆఫ‌ర్లు
X
స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి సౌత్ అగ్ర క‌థానాయిక‌గా ద‌శాబ్ధంన్న‌ర కెరీర్ ని సునాయాసంగా న‌డిపించేసిన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఆ త‌ర్వాత ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన `విక్ర‌మార్కుడు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. అటుపై కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. బాహుబ‌లిలో దేవ‌సేన‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క కెరీర్ లో అరుంధ‌తి- భాగ‌మ‌తి లాంటి నాయికా ప్ర‌ధాన చిత్రాలు ఉన్నాయి. హీరోల‌కు ధీటుగా జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే స‌త్తా ఉన్న న‌టిగా నిరూపించుకున్నారు.

అరుంధ‌తి 2 - పొన్నియ‌న్ సెల్వ‌న్- కొచ్చాడ‌యాన్- నార‌ప్ప చిత్రాల్లో న‌టించే అవ‌కాశాన్ని అనుష్క వ‌దులుకున్నారు. అటు హిందీలోనూ గోల్ మాల్ -త‌మాషా- సింఘం లాంటి క్రేజీ ఆఫ‌ర్లు వ‌రించినా స్వీటీ ఏమాత్రం ఆసక్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు. సౌత్ లో త‌నకు ఉన్న‌ సేఫ్ జోన్ నుంచి బ‌య‌ట‌ప‌డి బాలీవుడ్ లో న‌టించేందుకు ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు.

తన 14 సంవత్సరాల కెరీర్లో అనుష్క శెట్టికి చాలా పెద్ద అవకాశాలు వ‌చ్చాయి. కానీ ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల ఆమె కొన్నింటిని తిరస్కరించారు. దక్షిణ భారతదేశంలో అత్యంత భారీ పారితోషికం తీసుకునే క‌థానాయిక‌గానూ అనుష్క నిలిచారు.

గతంలో కరణ్ జోహార్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతోందని పుకార్లు వచ్చాయి. దర్శకుడు-నిర్మాత ఒక చిత్రం కోసం అనుష్క‌ను సంప్రదించినా.. ఆ పాత్రపై పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో స్వీటీ నిరాకరించార‌ని క‌థ‌నాలొచ్చాయి.

స్వీటీ వ‌దులుకున్న సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే..

1. పొన్నియిన్ సెల్వన్:

ద‌ర్శ‌క‌మ‌ణి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్`లో అవ‌కాశం వ‌చ్చినా దానిని అనుష్క‌ నిరాకరించింది. అదే పాత్రను ఇప్పుడు త్రిష పోషిస్తోంది. `పొన్నియ‌న్ సెల్వన్`లో విక్రమ్- జయం రవి- కార్తీ- జయరామ్- ఐశ్వర్య రాయ్ బచ్చన్- త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభు- విక్రమ్ ప్రభు- ఐశ్వర్య లక్ష్మి సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ కానున్న క్రేజీ చిత్రాల్లో ఒక‌టిగా ఈ సినిమా రికార్డుల్లో ఉంది.

2. కొచ్ఛాడ‌యాన్:
ర‌జ‌నీ యానిమేటెడ్ పాత్ర‌తో రూపొందించిన సినిమా ఇది. ఆయ‌న కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. దీపికా పదుకొనే స్థానంలో అనుష్క శెట్టి తొలి ఎంపిక. కానీ కాల్షీట్ల స‌మ‌స్య‌ కారణంగా ఈ చిత్రాన్ని తిరస్కరించారు.

3. అసురన్ తెలుగు రీమేక్ నారప్ప:

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `నార‌ప్ప`‌లో న‌టించాల్సిందిగా అనుష్క‌ను సంప్ర‌దించినా తిరస్క‌రించారు. నిజానికి శ్రీయా శరణ్ తొలి ఎంపిక. శ్రీయ‌ తిరస్కరించిన తరువాత అనుష్క శెట్టికి అవ‌కాశం ఇచ్చారు. కానీ నిశ్శ‌బ్ధంలో న‌టిస్తున్నందున కాల్షీట్ల స‌మ‌స్య త‌లెత్తింది. అలా నార‌ప్ప ఆఫ‌ర్ ని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ అసురన్ కి తెలుగు రీమేక్ ఇది.

4. అరుంధతి 2:
అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఫాంటసీ హార్రర్ చిత్రం 10 నంది అవార్డులను ద‌క్కించుకోవ‌డ‌మే గాక‌.. ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆ సినిమాలో జేజ‌మ్మ‌గా న‌టించి అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంది స్వీటీ.. అరుంధతి 2 త్వరలో సెట్స్ పైకి వెళుతుంద‌ని పుకార్లు వచ్చాయి. సీక్వెల్ కోసం అనుష్కను ఇప్పటికే సంప్రదించినా ఆ ప్రతిపాదనను తిరస్కరించార‌ని గుస‌గుస‌లు వ‌చ్చాయి. నిశ్శ‌బ్ధం తరువాత విరామం తీసుకోవాలని అనుష్క నిర్ణయించుకున్నారు. ఆ త‌ర్వాత‌ అరుంధతి 2 లో పాయల్ రాజ్ ‌పుత్ న‌టిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే అరుంధ‌తి నిర్మాత శ్యాంప్ర‌సాద్ రెడ్డి ఈ సీక్వెల్ నిర్మాత కాక‌పోవ‌డంతో ఆ సినిమాని అంతా లైట్ తీస్కున్నారు. అనుష్క‌- శ్యాంప్ర‌సాద్ జోడీ తీసేది మాత్ర‌మే అరుంధ‌తి సీక్వెల్ అవుతుంద‌న్న‌ది అభిమానుల బ‌ల‌మైన వాద‌న‌. అటు హిందీలోనూ ఐదారు భారీ క్రేజీ చిత్రాల్లో అవ‌కాశాల్ని అనుష్క కాద‌నుకున్నారు.