Begin typing your search above and press return to search.

వాళ్ళ అరుపులు కేకల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా: రాజమౌళి

By:  Tupaki Desk   |   19 March 2022 10:35 AM GMT
వాళ్ళ అరుపులు కేకల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా: రాజమౌళి
X
యావత్ సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న "ఆర్.ఆర్.ఆర్" సినిమా మరో ఆరు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ అవుతుండగా.. ముందు రోజు ప్రీమియర్స్ వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రౌద్రం రణం రుధిరం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ శరవేగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యట‌న చేస్తూ.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. కర్ణాటకలోని చికబల్లాపూర్‌ లో ఈ వేడుక జరగనుంది. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చిత్ర బృందంతో పాటుగా మరికొందరు ప్రముఖులు విచ్చేయనున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఇవాళ జరుగుతున్న భారతదేశపు అతిపెద్ద RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు. లేట్ నైట్ దుబాయ్ నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యామని.. ఈరోజు సాయంత్రం జరిగే వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని రాజమౌళి అన్నారు.

చాలా ఏళ్ల తర్వాత RRR ఈవెంట్ ద్వారా అందరినీ కలుస్తున్నామని.. ఇంత తక్కువ రోజుల్లో ఇంత పెద్ద ఈవెంట్ ఎలా చేయాలా అని టెన్షన్ పడ్డానని జక్కన్న తెలిపారు. అయితే నిర్వాహకులు అన్నీ పర్ఫెక్ట్ ప్లాన్ చేశారన్నారు. భారీ ఈవెంట్ లో ప్రేక్షకుల అరుపులు కేకల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని రాజమౌళి చెప్పారు.

RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమౌళి తో సహా హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా ఇప్పటికే బెంగుళూరు చేరుకున్నారు. రేపు (మార్చి 20) బరోడాతో పాటు ఢిల్లీలో త్రిపుల్ ఆర్ టీమ్ పర్యటించనుంది. అనంత‌రం మార్చి 21న అమృత్ సర్ - జైపూర్‌.. మార్చి 22న కోల్ కతా - వారణాసిలకు వెళ్లనున్నారు. చివరగా మార్చి 23న హైదరాబాద్‌ కు రావడంతో ప్రమోషనల్ టూర్ ను మిగించనున్నారు.

పెద్ద ఎత్తున చేస్తున్న ఈ ప్రమోషన్స్.. RRR సినిమాపై బజ్ రెట్టింపు చేసి భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకోడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఓవర్ సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ లో ఆర్ ఆర్ ఆర్ అదరగొడుతోంది. మరి ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

RRR లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇందులో అజయ్ దేవగన్ - అలియా భట్ - శ్రియా శరణ్ - ఒలివియా మోరిస్ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.