Begin typing your search above and press return to search.

తెలంగాణలో సినిమాలు చూస్తున్న ఏపీ సరిహద్దు ప్రాంతవాసులు..!

By:  Tupaki Desk   |   18 Dec 2021 7:07 AM GMT
తెలంగాణలో సినిమాలు చూస్తున్న ఏపీ సరిహద్దు ప్రాంతవాసులు..!
X
ఇటీవల కాలంలో కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా.. టాలీవుడ్ లో టిక్కెట్ల రేట్ల వ్యవహారం - బెనిఫిట్ షోలు వంటి అంశాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్లు మరియు థియేటర్స్ లో ప్రదర్శించే షోల సంఖ్య వేర్వేరుగా ఉంది.

సాధారణంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో బెనిఫిట్ షోలు ప్రదర్శించడం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నాళ్ల నుంచో జరుగుతున్న వ్యవహారం. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అదనపు షోలను రద్దు చేస్తూ.. టికెట్ ధరలను తగ్గిస్తూ జీవో జారీ చేసింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్ లో రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని సూచించింది.

దీంతో ఏపీలో ఎంత పెద్ద హీరో సినిమా ఐనా రోజుకు 4 షోలకే పరిమితం అవుతోంది. మరోవైపు తెలంగాణా ప్రభుత్వం పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యం కల్పించడంతో పాటుగా 5 షోలకు అవకాశం కల్పిస్తోంది. ఇలా పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నప్పుడు.. ఏపీలో ఎందుకు ప్రదర్శించరనేదే ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ''పుష్ప'' పార్ట్-1 సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 1150 పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఏపీలో ఉన్న నాలుగు షోల నిబంధనల దృష్ట్యా.. బెనిఫిట్ షోలు వేయలేదు. మరోవైపు తెలంగాణలో ఐదు షోలకు అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హాళ్లలో ఎర్ల్లీ మార్నింగ్ స్పెషల్ షోలు ప్రదర్శించారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఏపీలోని పలు ప్రాంతాల నుంచి సినీ అభిమానులు.. తెలంగాణలో సినిమా చూడటానికి వచ్చారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రూప్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చి తెలంగాణ బోర్డర్ లో 'పుష్ప' సినిమాను చూశారని తెలుస్తోంది.

అంతేకాదు ఏపీలో తక్కువ షోలకే సినిమా పరిమితం అవ్వడంతో టికెట్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలామంది అభిమానులు ఏపీ నుంచి పక్క రాష్ట్రానికి వచ్చి సినిమా చూడటానికి వచ్చారని తెలుస్తోంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ కోల్పోవాల్సి అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే ఆంద్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలు వేయకపోవడంపై హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది కొత్తగా సినిమాలపై ఆంక్షలు విధించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'పుష్ప' సినిమాకు స్పెషల్ షోలు ప్రదర్శించకపోవడం వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆగ్రహంతో థియేటర్లు ద్వంసం చేయడానికి కూడా యత్నించారు.

నిజానికి పెద్ద సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ల రేటు భారీగా పెరగకుండా ఉండాలనే లక్ష్యంతో.. బెనిఫిట్ షోల పేరుతో సినీ ప్రియుల సొమ్మును దోపిడీ చేస్తున్నారనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం వీటిని రద్దు చేసినట్లు చెబుతూ వస్తోంది. కానీ దీని వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో నష్టం వాటిల్లుతోందని 'పుష్ప' సినిమాని బట్టి అర్థం అవుతోంది. అంతేకాదు థియేటర్లలో అదనపు షోలు ప్రదర్శించడం వల్ల జెనెరేట్ అయ్యే ఇన్కమ్ కూడా లేకుండా పోతోంది.

సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నప్పటికీ.. దీని వల్ల ప్రభుత్వానికి కూడా లాస్ అని విశ్లేషకులు అంటున్నారు. సినిమాల నిర్మాతలు - ఎగ్జిబిటర్స్ తో పాటుగా ఫ్యాన్స్ నుంచి కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35 పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మరి త్వరలో ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందేమో చూడాలి.