Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

By:  Tupaki Desk   |   28 Dec 2021 7:00 PM IST
సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
X
సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా రచ్చ జరుగుతోంది. సినిమా వినోదం సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టికెట్ రేట్లను నియంత్రించామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు గవర్నమెంట్ నిర్దేశించిన ధరలతో నష్టపోతామని సినీ ప్రముఖులు అంటున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అధికారులు థియేటర్ల మీద తనిఖీలు నిర్వహించి.. నిబంధనలు పాటించడం లేదంటూ పలు థియేటర్లను సీజ్ చేశారు. తక్కువ టికెట్ ధరలతో సినిమాలను ప్రదర్శించలేమంటూ మరికొందరు స్వచ్ఛందంగా థియేటర్లను క్లోజ్ చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ వ్యవహారం పైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినీ డిస్ట్రిబ్యూటర్ల భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా టికెట్ల ధరలు పెంచాలనే ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచారు. ప్రభుత్వం స్లాబుల వైజ్ తీసుకొచ్చిన రేట్లలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ల పరిధిలోని ఏసీ థియేటర్లలో టికెట్ రేట్ గరిష్టంగా రూ.150 - కనిష్టంగా రూ. 50లు.. నాన్‌ ఏసీలో అత్యధికంగా రూ. 100 - లోయర్‌ క్లాస్‌ లో రూ.40 ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారని తెలుస్తోంది. అలాగే ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.100 - కనిష్టంగా రూ.40.. నాన్‌ ఏసీలో అత్యధికంగా రూ. 80 - కనిష్టంగా రూ.30 ఉండాలని డిస్టిబ్యూటర్లు ప్రతిపాదించారు.

ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌ గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉంటారు. సినిమా టికెట్ ధరల సమస్యలపై ఈ కమిటీ కూలంకషంగా చర్చించి ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది.