Begin typing your search above and press return to search.

RRR కోసం రూ.100 టికెట్ రేట్ పెంచిన ఏపీ సర్కార్..?

By:  Tupaki Desk   |   15 March 2022 10:02 AM GMT
RRR కోసం రూ.100 టికెట్ రేట్ పెంచిన ఏపీ సర్కార్..?
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాని మార్చి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ధర పెంపుదల విషయమై ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని రాజమౌళి - నిర్మాత డివీవీ దానయ్య కలిసిన సంగతి తెలిసిందే.

సీఎంతో భేటీ అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. RRR సినిమాకు ప్రభుత్వం తరపున చేయగలిగిన సపోర్ట్ చేస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు ఏపీ సర్కారు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రిపుల్ ఆర్ దర్శక నిర్మాతల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తూ.. సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఇటీవల సరికొత్త జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. 100 కోట్లకు పైగా ఖర్చు చేసిన సినిమాలకు.. తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే చిత్రాలను ప్రత్యేకంగా పరిగణించి టికెట్ ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగు చిత్ర పరిశ్రమకు హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో RRR సినిమాకు ప్రస్తుత ధరలపై రూ. 100 అదనంగా టిక్కెట్లను విక్రయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని సమాచారం. ఈ నిర్ణయంతో సినిమా కలెక్షన్లు మరింత పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఐదవ షోకి కూడా అనుమతి ఉంది. అలానే బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే కనుక జరిగితే జీవో వచ్చిన తర్వాత ఏపీ సర్కారు నుంచి ఇంత భారీ ప్రయోజనం పొందిన మొదటి తెలుగు సినిమా "RRR" అవుతుందని చెప్పాలి. దాదాపు రూ. 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ఏపీలో కూడా అధిక ధరలు అమ్మారు. ఇప్పుడు భారీగా రిటర్న్స్ రావాలంటే టికెట్ ధర చాలా కీలకం.

అందుకే భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటైన 'ఆర్.ఆర్.ఆర్' కు మద్దతుగా టికెట్ రేట్లు పెంచుకోడానికి జగన్ ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. దీంతో ఏపీలో కూడా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ఖాయమని అనుకోవచ్చు.