Begin typing your search above and press return to search.

జగన్ ను కలిసిన హీరోలందరి సినిమాలు ప్లాప్.. మహేశ్ బాబు మాటేంటి?

By:  Tupaki Desk   |   3 May 2022 5:32 AM GMT
జగన్ ను కలిసిన హీరోలందరి సినిమాలు ప్లాప్.. మహేశ్ బాబు మాటేంటి?
X
సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత బయటకు వస్తున్న సమాచార స్వరూపం మారిపోతోంది. అంతేకాదు.. ఏదైనా ఘటన చోటు చేసుకున్నంతనే దానికి స్పందిస్తున్న తీరులోనూ మార్పు వచ్చింది. కొన్ని అంశాల మీద ఫుల్ పాజిటివ్ గా రియాక్టు అయ్యే నెటిజన్లు.. మరికొన్ని సందర్భాల్లో అందుకు భిన్నంగా రెస్పాండ్ అవుతుంటారు. ఇక.. అభిప్రాయాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

ప్రధాన మీడియాలో కనిపించని అభిప్రాయాలు.. స్పందనలు సోషల్ మీడియాలో బోలెడన్ని కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ముచ్చటే ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అదేమంటే.. జగన్ ను కలిసిన సినీ ప్రముఖుల సినిమాలు విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతున్న వైనాన్ని ప్రస్తావిస్తూ.. తర్వాత వంతు మహేశ్ బాబుదే అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అదెలానంటే.. కాస్తంత ప్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సి ఉంటుంది.

కరోనా తర్వాత సినిమా బతకాలంటే సినిమా టికెట్ల ధరలు పెంచటమేనని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే.. అందుకు భిన్నంగా కారుచౌకగా సినీ వినోదాన్ని సామాన్యులకు అందించాలన్న పట్టుదలను ప్రదర్శించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అదంతా టాలీవుడ్ ను టార్చర్ పెట్టేందుకేనని కొందరు చెబుతుంటారు. తనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వని తెలుగు చిత్రపరిశ్రమ సంగతి చూడాలని డిసైడ్ అయిన జగన్.. అందుకు తగ్గట్లే సినిమా టికెట్ల అంశాన్ని తెర మీదకు తెచ్చారంటారు.

సులభ్ కాంప్లెక్స్ లో టాయిలెట్ కు అయ్యే ఖర్చు కంటే తక్కువ ధరకు మూడు గంటల సినిమా టికెట్ అందుబాటులోకి వచ్చేలా చేయటమే కాదు.. తక్కువ ధరకు సినిమా టికెట్లు ఉంటే.. ఎంత మేలు జరుగుతుందో అన్న వాదనను రాజకీయ ప్రముఖులు పలువురు వినిపించిన వాదన అంతా ఇంతా కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగాఉలిక్కిపడటమే కాదు.. ఆయన్ను ప్రసన్నం చేయటానికి జరిగిన పాట్ల గురించి తెలిసిందే. దీంతో.. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురుకలిసి ఒక టీంగా ఏర్పడి.. సీఎం జగన్ ను కలవటం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల సంగతి అందరికి తెలిసిందే.

అలా సీఎం జగన్ ను కలిసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి.. డార్లింగ్ ప్రభాస్.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తదితరులు ఉన్నారు. ఈ భేటీపై బోలెడన్ని విశ్లేషణలతో పాటు.. అగ్ర హీరోలంతా తమ సినిమా విడుదల కోసమే కలిసినట్లుగా విమర్శలు చెలరేగాయి. అదే సమయంలో ఈ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం సీఎం జగన్ ను కలిసేదే లేదన్నట్లుగా వ్యవహరించారు. తనకు నష్టం వాటిల్లినా ఫర్లేదు కానీ.. జగన్ విషయంలో తగ్గేదెలే అన్నట్లుగా ఆయన తీరు ఉండటం తెలిసిందే.

చివరకు సీఎం జగన్ తో జరిపిన మంతనాలు ఫలించి.. రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకోవచ్చన్న దానిపై జగన్ సర్కారు సానుకూలంగా స్పందించి.. టికెట్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాంటి నిర్ణయం పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ మూవీ విడుదల తర్వాతే చోటు చేసుకోవటాన్ని పలువురు ప్రస్తావిస్తూ.. ఏపీ ప్రభుత్వం తమ అభిమాన నటుడ్ని దెబ్బ తీసేలా వ్యవహరించిందన్న వాదనను వినిపించారు.

ఇదిలా ఉంటే.. అప్పట్లో టికెట్ల పెంపు కోసం సీఎం జగన్ తో భేటీ అయిన ప్రభాస్.. చిరంజీవిలు నటించిన తాజా సినిమాలు డిజాస్టర్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మిగిలింది మహేశ్ బాబు వంతు అయిన.. ఆయన నటించిన తాజా మూవీ సర్కారు వారి పాట రిలీజ్ కు సిద్దంగా ఉండటంతో కొత్త సెంటిమెంట్ మాట ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఒకవేళ మహేశ్ మూవీ సక్సెస్ అయితే.. ఈ సెంటిమెంట్ కు చెక్ పెట్టినట్లే అవుతుందని.. పొరపాటున ప్రభాస్.. చిరులకు ఎదురైన అనుభవమే ఎదురైతే మాత్రం.. సీఎం జగన్ కు కొత్త ట్యాగ్ లైన్ కట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.