Begin typing your search above and press return to search.

అక్క‌డ బొమ్మ ప‌డాలంటే ఆ ఒక్క‌టే అడ్డు..!

By:  Tupaki Desk   |   31 July 2021 6:53 AM GMT
అక్క‌డ బొమ్మ ప‌డాలంటే ఆ ఒక్క‌టే అడ్డు..!
X
ఎట్ట‌కేల‌కు నిన్న‌టి నుంచి తెలంగాణ‌లో థియేట‌ర్లు అన్ లాక్ అయ్యాయి. కొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. థ‌ర్డ్ వేవ్ ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌న్న‌ది త‌ర్వాత సంగ‌తి.. ముందు బొమ్మ ప‌డింద‌ని తెల‌గాణ నుంచి స‌ర్వ‌త్రా సంతోషం వ్య‌క్తం అవుతోంది. ఇక ఏపీలోనే ప‌రిస్థితి ఎటూ తేల‌లేదు. ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చినా థియేట‌ర్ యాజ‌మాన్యాలు తెర‌వ‌డానికి ఎంత మాత్రం ఆస‌క్తి చూపించ‌లేదు. యాభై శాతం ఆక్యుపెన్సీ..త‌గ్గిన టిక్కెట్ ధ‌ర‌ల‌తో రిలీజ్ చేస్తే న‌ష్టాలు త‌ప్ప లాభాలు తేవ‌డం ఎలా? అనే ఆందోళ‌న ఏపీ ఎగ్జిబిట‌ర్ల‌లో ఉంది. పెద్ద రేటు ఉన్న‌ప్పుడే న‌ష్టాల్ని భ‌రించాల్సొచ్చింద‌న్న వాద‌నా అక్క‌డ బ‌లంగా ఉంది.

ప్ర‌భుత్వ అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి ప‌రిష్కారం కోరాల‌ని థియేట‌ర్ యాజ‌మాన్యాలు.. నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్ప‌ట్లో ఆ అవ‌కాశం ప్ర‌భుత్వం క‌ల్పించే ఛాన్స్ లేద‌ని బ‌ల‌మైన ప్ర‌చారం సాగుతోంది. అక్టోబ‌ర్ వ‌ర‌కూ ముఖ్య‌మంత్రి ఎలాంటి వెసులుబాట్లు క‌ల్పించే ఛాన్స్ ఎంత మాత్రం లేద‌ని స‌మాచారం. ఈ విష‌యాలు సినీ పెద్ద‌ల‌కి తెలిసిన‌ట్లు భోగ‌ట్టా. అదే నిజ‌మైతే ఆగ‌స్టులో ఏపీలో సినిమా రిలీజ్ లు దాదాపు అసాధ్య‌మ‌నే భావిస్తున్నారు. ఎగ్జిబిట‌ర్ల అసంతృప్తి కార‌ణంగా..ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం దిగి రాద‌నే ప్ర‌చారంతో ఇక ఎవ‌రూ ముందుకు క‌దిలే అవ‌కాశం క‌డా క‌నిపించ‌లేదు.

ఇదంతా చూస్తుంటే ఆగ‌స్టులో రిలీజ్ లు లేన‌ట్లేన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. థ‌ర్డ్ వేవ్ పూర్త‌యిన త‌ర్వాత అప్ప‌టి ప‌రిస్థితులు బ‌ట్టి ప్రభుత్వం చ‌ర్చ‌ల‌కు పిలిచే అవ‌కాశం ఉంటుంది. ఇక నిర్మాత‌లు ఒక‌వేళ సినిమాలు ముందుగానే రిలీజ్ చేసుకోవాలంటే నేరుగా ఓటీటీల‌తోనే ఒప్పందం చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఓటీటీకే విక్ర‌యిస్తున్న‌ నేప‌థ్యంలో స‌ద‌రు నిర్మాత‌లు సేఫ్ జోన్ ని ప్లాన్ చేస్తున్నారు. అయితే మీడియం బ‌డ్జెట్ సినిమాల‌ను థియేట‌ర్ల‌లోకి తేవాల‌నుకున్న వారంతా.. తెలంగాణ రెవెన్యూ పైనే ఫోక‌స్ చేసి అలాగే అమెరికా మార్కెట్ పైనా ఆశావ‌హ ధృక్ప‌థంతో ఉండాల్సిందేనన్న చ‌ర్చా సాగుతోంది.

ఎగ్జిబిట‌ర్ల మీటింగ్ ఉఫ్‌:

విజ‌య‌వాడ‌-(ఏపీ)లో 13 జిల్లాల ఎగ్జిబిట‌ర్లు ఇటీవ‌ల‌ స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిన‌దే. నెలలుగా మూత ప‌డి ఉండ‌డంతో కునారిల్లుతున్న ఎగ్జిబిష‌న్ రంగంపై వీరంతా చ‌ర్చించారు. విజయవాడ- తెలుగు ఫిలిం ఛాంబర్‌‌లో 13జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశానికి అన్ని ప్రాంతాల నుంచి ధియేటర్‌‌ ల యజమానులు హాజరయ్యారు. ఈనెల 30 నుంచి థియేట‌ర్ల‌ను తెర‌వాల‌ని నిర్ణ‌యించార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే 50 శాతం ఆక్యూపెన్సీ తో త‌మ‌కు న‌ష్టాలు త‌ప్ప‌వ‌నేది చ‌ర్చ‌కు వ‌చ్చింది. టిక్కెట్టు ధ‌ర చాలా త‌క్కువ. ఇప్పుడున్న ధ‌ర‌ల‌తో త‌మ‌కు తీవ్ర నష్టాలు త‌ప్ప‌వ‌ని నివేదించారు. బి- సి కేంద్రాల్లో థియేటర్లు తెరిచినా జీవో 35వల్ల మనుగడ కష్టం. అందువ‌ల్ల టిక్కెట్టు ధ‌ర‌ల పెంపుపై జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే సీఎంని క‌ల‌వాల‌ని నిర్ణ‌యించారు.

తెలంగాణ‌కు టిక్కెట్టు ఇక్క‌ట్లు

ఏపీలో న‌ష్టాలొస్తే తెలంగాణ‌లో లాభాలొచ్చినా ఏ ప్ర‌యోజ‌నం? అందుకే ఇరు రాష్ట్రాల్లో థియేట‌ర్ య‌జ‌మానులు పంపిణీదారులు ఆందోళ‌న‌లోనే ఉన్నారు. అందుకే ముంద‌స్తుగానే తెలంగాణ‌లో థియేట‌ర్లు తెర‌వ‌క ముందే ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల పెంపుపై తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఇంత‌కుముందే ఏపీ ప్ర‌భుత్వానికి నివేదించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ఛాంబ‌ర్ అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు ఒక మెమోరండాన్ని పంపారు. కానీ దానిపై ఏపీ ప్ర‌భుత్వం పాజిటివ్ గా స్పందించ‌లేదు. టిక్కెట్టు ధ‌ర‌ల‌పై మొండి ప‌ట్టు వీడ‌లేదన్న టాక్ వినిపించింది.