Begin typing your search above and press return to search.

చరణ్ దెబ్బ నుంచి ఇప్పటికి కోలుకున్నాడు

By:  Tupaki Desk   |   7 Feb 2017 5:30 PM GMT
చరణ్ దెబ్బ నుంచి ఇప్పటికి కోలుకున్నాడు
X
ముంబయ్ సే ఆయా మేరా దోస్త్.. ఏక్ అజ్ నబీ.. షూటౌట్ అట్ లోఖండ్ వాలా.. దస్ కహానియా.. మిషన్ ఇస్తాంబుల్.. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేని వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియా. ఇలాంటి టైంలో అతడి కెరీర్ ను ఒక కుదుపు కుదిపేసింది ‘జంజీర్’. ఐతే అతడికెవరు సలహా ఇచ్చారో కానీ.. ఒకప్పటి ఈ క్లాసిక్ ను రీమేక్ చేయడానికి సాహసించాడు. పైగా హిందీ ప్రేక్షకులకు అసలేమాత్రం పరిచయం లేని తెలుగు హీరో రామ్ చరణ్ తో అమితాబ్ బచ్చన్ లాంటి మెగాస్టార్ చేసిన పాత్రను చేయించాడు. నాలుగేళ్ల కిందట ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

లఖియా కొట్టిన దెబ్బ నుంచి చరణ్ త్వరగానే కోలుకున్నాడు కానీ.. చరణ్ కొట్టిన దెబ్బ నుంచి లఖియా మాత్రం అంత సులువుగా కోలుకోలేదు. మూడేళ్లకు పైగా అసలే సినిమా చేయలేకపోయాడతను. ఎట్టకేలకు ఈ ఏడాది తన కొత్త సినిమాతో పలకరించబోతున్నాడు లఖియా. ఈసారి అతనో ఇంట్రెస్టింగ్ బయోపిక్ రెడీ చేస్తున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి అయిన హసీనా కథతో బయోపిక్ చేస్తున్నాడు లఖియా. శ్రద్ధ కపూర్ హసీనా పాత్రలో నటిస్తుండటం విశేషం. బాలీవుడ్లో బయోపిక్స్ హవా నడుస్తున్న నేపథ్యంలో లఖియా ఒక ఆసక్తికర కథను ఎంచుకుని సినిమా తీశాడు. అందరికీ దావూద్ గురించి తెలుసు కానీ.. అతడి సోదరి గురించి పెద్దగా పరిచయం లేదు. ఐతే హసీనా కథలో చాలా మలుపులున్నాయట. ఈ చిత్ర ఫస్ట్ లుక్ సినిమా మీద బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఏడాది జులై 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/