Begin typing your search above and press return to search.

మంచి సినిమా రిలీజ్ కోసం ఎన్ని కష్టాలో..

By:  Tupaki Desk   |   12 Dec 2016 10:14 AM GMT
మంచి సినిమా రిలీజ్ కోసం ఎన్ని కష్టాలో..
X
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే.. దాన్ని రిలీజ్ చేసుకోవడం చాలా కష్టం. ఎన్నో సినిమాలు సెట్స్ మీదికి వెళ్లి మధ్యలో ఆగిపోవడం.. లేదా సినిమా అంతా అయ్యాక విడుదలకు నోచుకోకపోవడం ఇండస్ట్రీలో మామూలే. ఇలాంటి సినిమాలు వందల్లో ఉంటాయి. అందులో కొన్ని మంచి సినిమాలు కూడా ఉంటాయి. డబ్బింగ్ ఆర్టిస్.. సీనియర్ నటి.. రఘువరన్ భార్య రోహిణి తొలిసారి దర్శకత్వం వహిస్తూ తమిళంలో ఓ మంచి సినిమానే తీసింది. ఆ సినిమా పేరు.. అప్పా మీసై (నాన్న మీసం). ఇందులో నిత్యా మీనన్ కథానాయికగా నటించడం విశేషం. నాజర్.. చేరన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇప్పటికే ఓ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న శ్రీకర్ ప్రసాద్ (ఎడిటర్).. ఆస్కార్ అవార్డు అందుకున్న రసూల్ పొకుట్టి (సౌండ్ డిజైనింగ్) లాంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారు. ఐతే ఈ సినిమాకు బడ్జెట్ కష్టాలు ఎదురయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం పెండింగ్ పడింది. సినిమాను రిలీజ్ చేయడానికి కూడా డబ్బు అవసరం. మొత్తంగా రూ.40 లక్షల దాకా అవసరం కావడంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆ డబ్బులు సమకూర్చుకునే ప్రయత్నంలో పడింది రోహిణి. కన్నడ నాట సంచలన విజయం సాధించిన ‘లూసియా’ చిత్రాన్ని ఇలాగే క్రౌడ్ ఫండింగ్ ద్వారా పూర్తి చేసి రిలీజ్ చేశాడు పవన్ కుమార్ అనే దర్శకుడు. అతను రోహిణికి ఫ్రెండు కావడంతో.. అతడి సలహా మేరకే క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టింది రోహిణి. ఆమె ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.