Begin typing your search above and press return to search.

'7వండర్స్‌' ఇన్‌ ఏ.ఆర్‌.రెహమాన్‌ లైఫ్‌

By:  Tupaki Desk   |   11 April 2015 9:30 AM GMT
7వండర్స్‌ ఇన్‌ ఏ.ఆర్‌.రెహమాన్‌ లైఫ్‌
X
ప్రపంచ సినీయవనికపై భారతీయ జెండా రెపరెపలాడించిన గొప్ప సంగీతదర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావించే ఆస్కార్‌ అవార్డును భారత దేశానికి అందించిన సంగీత దిగ్గజం అతడు. శూన్యం నుంచి సంగీత ధ్వనుల్ని ఒడిసిపట్టుకునే ఏకైక సంగీత దర్శకుడు కూడా అతడే. మనిషై పుట్టాక అసలు పీక్స్‌ అనే పదానికి నిర్వచనం చెప్పిన గొప్ప మహానుభావుడు రెహమాన్‌. అంతటి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించిన రెహమాన్‌ అవెలా వచ్చాయో చెప్పారు. తన జీవితంలో సెవెన్‌ వండర్స్‌ గురించి ఇలా చెప్పారు.

రోజా:

సంగీత దర్శకుడిగా తొలి అవకాశం వచ్చింది ఈ చిత్రంతోనే. 1992లో ఈ సినిమా రిలీజైంది. ఆ తర్వాత వెనుదిరిగి చూసిందే లేదు. తొలిసినిమాతోనే సంగీత దర్శకుడిగా నిరూపించుకునే అవకాశం వచ్చింది.

రంగీల:

నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన సినిమా ఇది. ఈ చిత్రంతోనే హిందీ పరిశ్రమలో అడుగుపెట్టాను. తొలిచిత్రంతోనే బాగా పేరొచ్చింది. అక్కడా తిరుగులేని సంగీత దర్శకుడయ్యానంటే ఆ సినిమా వల్లే. రంగీల సంగీతానికి బోలెడు ప్రశంసలొచ్చాయి.

వందేమాతరం:

మా తుఝే సలాం... వందేమాతరం అంటూ దేశానికి ఓ గీతాన్ని అంకితమిచ్చాను. అది నాకు ఎనలేని కీర్తిని తెచ్చింది. ఆల్బమ్‌లోని ప్రతి పాటా నాకు చాలా ప్రత్యేకం. ప్రజల్లో నేను ఒక ఐకన్‌ అయ్యానంటే ఈ ఆల్బమ్‌ వల్లే. అది గొప్ప గుర్తింపు.

పెళ్లి:

జీవితంలో ఎంతో ముఖ్యమైనది ఇది. పెళ్లాం, పిల్లలు చాలా ముఖ్యం. అదృష్టం కొద్దీ నన్ను, నా పనిని అర్థం చేసుకునే భార్య వచ్చింది.

బాంబే డ్రీమ్స్‌:

ఇది నా తొలి అంతర్జాతీయ ప్రాజెక్టు. నా సంగీతాన్ని అంతర్జాతీయ ప్రేక్షకుడికి చేరువ చేసింది ఈ సినిమానే.

స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌:

ఈ సినిమాతోనే ఆస్కార్‌ దక్కింది. ఆ ఏడాది అంతా సంబరాలే. ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక అవార్డులన్నీ ఈ ఒక్క సినిమాతోనే అందుకున్నా.

నా కల:

కెఎం మ్యూజిక్‌ కంజర్వేటరీని ప్రారంభించాలనుకుంటున్నా. అది నా కల. ఇక్కడ సంగీత విద్యను అభ్యసించే ఒక్కో విద్యార్థి నాకు దక్కిన ఒక్కో అవార్డుతో సమానం.