Begin typing your search above and press return to search.

తెలుగు హిట్ దేవుడినే అడగాలి

By:  Tupaki Desk   |   9 April 2019 5:25 AM GMT
తెలుగు హిట్ దేవుడినే అడగాలి
X
సుస్వరాల పూదోటలో స్వరమాంత్రికుడిగా గొప్ప సేవ అందించారు ది గ్రేట్ ఏ.ఆర్.రెహమాన్. ఇళయరాజా తర్వాత శూన్యం నుంచి సంగీత ధ్వనులు క్రియేట్ చేయగలిగే ఏకైక సంగీత దర్శకుడిగా అతడు ఒక చరిత్రకు కారకుడయ్యారు. ఆస్కార్ గ్రహీతగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన రెహమాన్ లైఫ్ లో ఎంతో సాధించినా.. ఒకే ఒక లోటు మాత్రం అలానే ఉండిపోయింది. అదే ఓ తెలుగు బ్లాక్ బస్టర్ కి సంగీతం అందించడం. అది ఎప్పటికీ నెరవేరని కలలాంటిదని రెహమాన్ భావిస్తున్నారా? అంటే అవుననే అర్థమవుతోంది. లేటెస్టుగా ఈ విషయంపై రెహమాన్ చేసిన ఓ కామెంట్ తెలుగు మీడియాలో ఆసక్తికర చర్చకు తావిచ్చింది.

నిన్నటిరోజున `అవెంజర్స్ : ఎండ్ గేమ్` తెలుగు వెర్షన్ ఆంథెమ్ ని హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ ఈవెంట్ కి విచ్చేసిన రెహమాన్ కి తెలుగు మీడియా నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు మ్యూజిక్ ఇచ్చిన ఏ తెలుగు సినిమా హిట్ కొట్టలేదు.. అది ఎప్పటికి సాధ్యం? అని ప్రశ్నించారు ఓ పాత్రికేయుడు. అందుకు రెహమాన్ కాస్త తటపటాయిస్తూ.. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్... టాలీవుడ్ లో హిట్టు దేవుడినే అడగాలి అని వ్యాఖ్యానించారు. అయితే రెహమాన్ ప్రస్తుతం వరుసగా తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. అందువల్ల ఆయన ఓ తెలుగు సినిమాకి సంగీతం అందించే ఆస్కారం ఇప్పట్లో లేదని అర్థమవుతోంది. ఇక రెహమాన్ టాలీవుడ్ గ్రాఫ్ పరిశీలిస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి.

రెహమాన్ తొలుత తెలుగు సంగీత దర్శకులు రాజ్ కోటి వద్ద అసిస్టెంట్ గా.. కీబోర్డ్ ప్లేయర్ గా పని చేశారు. సంగీత సాధన తప్ప వేరొక ధ్యాస లేని టీనేజీ కుర్రాడిగా అతడి పనితనం ఎంతో మంత్రముగ్ధం చేసేదని కోటి పలు సందర్భాల్లో వేదికలపైనే చెప్పారు. ఆ తర్వాత మణిరత్నం రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రమోటయ్యారు. రోజా, దొంగా దొంగా, మనీ, మనీ మనీ, బొంబాయి, ప్రేమికుడు, భారతీయుడు, ప్రేమికుల రోజు, ప్రేమదేశం, బోయ్స్ ఇలా ఎన్నో క్లాసిక్స్ కి మ్యూజిక్ అందించారు ఏ.ఆర్.రెహమాన్. అవన్నీ హిట్టు సినిమాలే అయినా తమిళ్ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమాల కిందే లెక్క. అందుకే అతడు డైరెక్టుగా తెలుగు సినిమాకి సంగీతం అందించినవి పరిశీలిస్తే అవన్నీ ఫ్లాప్ ల జాబితాలోనే కనిపిస్తాయి. నాగార్జున రక్షకుడు మ్యూజిక్ బంపర్ హిట్. కానీ సినిమా ఫ్లాప్. మహేష్ నటించిన నాని మ్యూజిక్ సూపర్ హిట్. కానీ సినిమా ఫ్లాప్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొమరం పులి మ్యూజిక్ హిట్.. కానీ సినిమా ఫ్లాప్. అందుకే రెహమాన్ కి తెలుగు సినిమాల పరంగా ఆ ఒక్క బ్యాడ్ నేమ్ ని తొలగించుకోలేకపోతున్నానన్న కలత అలానే ఉంది మరి.