Begin typing your search above and press return to search.

5వేల మందికి జాబ్ లు ఇచ్చిన ఆ ‘విలన్’

By:  Tupaki Desk   |   19 Dec 2016 5:33 AM GMT
5వేల మందికి జాబ్ లు ఇచ్చిన ఆ ‘విలన్’
X
కొంతమంది గురించి మీడియాలో అదే పనిగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అవసరం ఉన్నా.. లేకున్నా ఆకాశానికి ఎత్తేస్తుంటారు. దీనికి భిన్నంగా మరికొందరి విషయంలో మీడియా శీతకన్ను వేస్తుంటుంది. వారెంత తోపులైనా.. పెద్దగా పట్టించుకోదు. వారిలో అందరికి తెలిసిన కోణమే తప్పించి.. తెలియని కోణాల్ని అస్సలు బయటకు తీసుకురాదు.

అయితే.. అనుకోకుండా మాటల సందర్భంలో వచ్చే కొన్ని విషయాలు విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ కావటమేకాదు.. ఇంతకాలం అతగాడికి సంబంధించిన అంత ఆసక్తికరమైన విషయాలు ఎందుకు ఇవ్వలేదన్న అగ్రహం కలుగుతుంది. అలాంటి ఉదంతమే ఇప్పుడు మీకు చెప్పబోతున్నారు. దళపతి సినిమాలో తళుక్కున మెరిసి.. రోజాతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. భారత్ మొత్తానికి అందగాడిగా పేరు పొందిన వ్యక్తి అరవింద స్వామి.

అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి సినిమాల నుంచి దూరమైనా.. పట్టించుకున్న వారే లేరు. తమిళ సినిమాల్లో నటిస్తూ.. ఆ మధ్యన విడుదలైన కడలితో రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. తని ఒరువన్ చిత్రంలో స్టైలిష్ విలన్ గా ఒక మెరుపు మెరిసిన ఆయన.. ఆ చిత్రాన్ని తెలుగులో ధృవ పేరిట రీమేక్ లోనూ విలన్ పాత్రలో పోషించారు. తన అద్భుతమైన నటనతో అందరి మనసుల్ని దోచుకున్న అరవింద్.. తనకు సంబంధించిన రెండు ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు.

సినిమాల్లో వచ్చే స్టార్ డమ్ ను ఎంజాయ్ చేయటం కంటే జీవితంలో మరిన్ని పనులు చేయాలన్న భావన తన మనసులో ఉండేదని.. అందుకే మధ్యలో గ్యాప్ తీసుకొని బిజినెస్ మీద దృష్టి పెట్టినట్లు చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో పలు వ్యాపారాలు చేసిన ఈ ‘విలన్’ దగ్గర ప్రస్తుతం ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారట. సినిమా యాక్టర్ గా మాత్రమే తెలిసిన అరవింద్ స్వామిలో ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడా? అన్నది ఒక ఆశ్చర్యమైతే.. తన జీవితంలో జరిగిన మరో విషాదాన్ని అతడు రియల్ హీరోగా అధిగమించిన వైనం ఆయనపై మరింత అభిమానాన్ని పెంచుతుంది.

పదేళ్ల క్రితం అంటే.. 2006లో ఒక యాక్సిడెంట్ జరిగి.. వెన్నెముకకు గాయమై.. పక్షవాతం వచ్చిందని.. ఏడాది పాటు నడవలేకపోయానని.. మళ్లీ మామూలు మనిషిని కావటానికి నాలుగేళ్లు పట్టిందని చెప్పుకొచ్డు. ఆ టైంలో మానసికంగా బలంగా ఉండాలని తాను అనుకున్నానని.. ఏదో ఒక పనితో బిజీ కావాలని అనుకున్నానని.. నటుడిగా మళ్లీ రావటానికి ఇదో కారణంగా చెప్పుకొచ్చారు. రీల్ మీద విలన్ లో ఇంతటి ‘రియల్’ హీరో ఉండటం అరుదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/