Begin typing your search above and press return to search.

సక్సెస్ మీట్.. అంత తొందరెందుకు?

By:  Tupaki Desk   |   13 Oct 2018 3:30 AM GMT
సక్సెస్ మీట్.. అంత తొందరెందుకు?
X
ఒక కొత్త సినిమా ఫలితం ఏంటో అంచనా వేయడానికి కనీసం వీకెండ్ అయ్యే వరకు అయినా ఆగాలి. ఆ తర్వాతే సక్సెస్ మీట్ పెట్టినా.. థ్యాంక్స్ మీట్ పెట్టినా బాగుంటుంది. కానీ ఈ మధ్య టాలీవుడ్ దర్శక నిర్మాతలు మరీ తొందర పడిపోతున్నారు. విడుదలైన ఒకట్రెండు రోజులకే థ్యాంక్స్ మీట్ అని.. సక్సెస్ మీట్ అని పెట్టేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ మధ్య డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రానికి వెంటనే ఇలాంటి మీట్ ఒకటి పెట్టేశారు. వినాయక చవితి రోజు రిలీజ్ కావడం వల్ల ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. ఆ లెక్కలు చూపిస్తూ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేశారు. అందులో భాగంగా థ్యాంక్స్ మీటో.. సక్సెస్ మీటో.. ఏదో ఒక పేరు పెట్టి మీడియాను కలిశారు. ఇప్పుడు ‘అరవింద సమేత’ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది.

ఈ సినిమాకు టాక్ బాగానే ఉంది. కొంతమంది నెగెటివ్ గా స్పందిస్తున్నా.. ఎక్కువ మంది సినిమా గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. దసరా సీజన్లో సినిమాను రిలీజ్ చేయడం.. థియేటర్లు కూడా భారీగా ఉండటంతో సినిమాకు కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. నాన్-బాహుబలి రికార్డులు బద్దలైనట్లు కూడా చెబుతున్నారు. ఐతే కనీసం ఒక్క రోజు రన్ కూడా పూర్తి కాకుండానే తొలి రోజు సాయంత్రానికే చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టేసింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి మీడియాను కలిసింది. గతంలో అసలు సినిమాల ప్రమోషన్లలోనే కనిపించని త్రివిక్రమ్.. ఈ చిత్రం కోసం విడుదల ముందు మీడియాను కలవడమే కాదు.. తొలి రోజు సాయంత్రానికే వచ్చిన ప్రెస్ మీట్లో కూర్చున్నాడు. దీనికి పేరు పెట్టలేదు కానీ.. ఒక రకంగా సక్సెస్ మీట్ అన్నట్లే ఉంది. సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందని.. వసూళ్లు అదిరిపోయాయని.. బ్లాక్ బస్టర్ అని చిత్ర బృందం చెప్పుకుంది. ఐతే సినిమా ఫలితంపై జనాలు ఒక అంచనాకు రాకముందే ఇంత తొందరగా ‘మీట్’లు పెట్టడం ఎందుకని.. దీని వల్ల జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయని విశ్లేషకులు అంటున్నారు.