Begin typing your search above and press return to search.

ఏషియన్ గ్రూప్ వారు సినిమా నిర్మాణ రంగంలో రాణించలేకపోతున్నారా?

By:  Tupaki Desk   |   26 Oct 2022 4:01 AM GMT
ఏషియన్ గ్రూప్ వారు సినిమా నిర్మాణ రంగంలో రాణించలేకపోతున్నారా?
X
ఏషియన్ గ్రూప్ అధినేత సునీల్ నారంగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా.. ఫైనాన్సర్ గా.. థియేటర్ చైన్ ఆపరేటర్ గా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గతేడాది 'శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ' అనే బ్యానర్ స్థాపించి సినిమా నిర్మాణంలోకి దిగిన సంగతి తెలిసిందే.

SVC బ్యానర్ లో తొలి ప్రయత్నంగా సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్మోహన్ రావు కలిసి 'లవ్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

పాండమిక్ టైంలో 50 శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో విడుదలైన 'లవ్ స్టొరీ' సినిమా తక్కువ టికెట్ రేట్లతోనూ భారీ వసూళ్లను నమోదు చేసింది. 30 కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందిస్తే.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 60 కోట్ల వరకూ కలెక్షన్స్ అందుకుంది. అయితే సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయిన ఏషియన్ గ్రూప్ వారి ప్రొడక్షన్ హౌస్.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతోంది.

నార్త్ స్టార్ శరత్‌ మరార్‌ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో రెండో ప్రొడక్షన్ గా 'లక్ష్య' చిత్రాన్ని రూపొందించారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా ప్లాప్ అయింది. ఇదే క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'అనుభవించు రాజా' సినిమాలోనూ ఏషియన్ వారు భాగమయ్యారు. ఇది కూడా నిర్మాతలకు నిరాశే మిగిల్చింది.

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఇదే ప్రొడక్షన్ హౌస్ లో రూపొందించిన 'ది ఘోస్ట్' సినిమా ఇటీవల దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ వసూళ్ళు రాబట్టడంలో వెనుకబడిపోయింది. దీంతో ఎస్వీసీ బ్యానర్ లో మరో పరాజయం వచ్చి చేరినట్లైంది.

ఇక తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో 'ప్రిన్స్' వంటి కామెడీ ఎంటర్టైనర్ తెరంకెక్కించారు. దీపావళి సందర్భంగా తెలుగు తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. వసూళ్ల వేటలో బాక్సాఫీస్ వద్ద పోరాడుతోంది.

ఏషియన్ సినిమాస్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో 'లవ్ స్టొరీ' ఒక్కటే ఘన విజయం సాధించింది. మిగతావి ఆశించిన ఫలితాన్ని అందించలేదు. రాబోయే రోజుల్లో వచ్చే సినిమాల రిజల్ట్స్ కూడా ఇలానే ఉంటే మాత్రం.. ప్లాప్ బ్యానర్ అనే ముద్ర పడుతుంది. అప్పుడు పెద్ద హీరోలతో ప్రాజెక్ట్స్ సెట్ చేయడం కష్టంగా మారుతుంది.

ఈ నేపథ్యంలో ఏషియన్ సినిమాస్ బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకుని.. తమ ఖ్యాతిని వీలైనంత త్వరగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఆసియన్ నిర్మాతలు ఇప్పటికే పలువురు టాప్ హీరోలకు భారీగా అడ్వాన్సులు చెల్లించారని టాక్ ఉంది. కాకపోతే స్టార్స్‌ తో ప్రాజెక్ట్‌ లు మెటీరియలైజ్ కావాలంటే కాస్త టైం పట్టేలా ఉంది.

ప్రస్తుతం SVC బ్యానర్ లో సందీప్ కిషన్ హీరోగా 'మైఖేల్' అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. కరణ్ సి ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఎస్ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది. అలానే సుధీర్ బాబు తో ఓ సినిమా సెట్స్ మీద ఉంది. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా సునీల్ నారంగ్ అనౌన్స్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ అలస్యమవుతూ వస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.