Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ మ్యాన్-2' వివాదంపై తమిళ తంబీలు సైలెంట్ అయినట్లేనా..?

By:  Tupaki Desk   |   5 Jun 2021 4:30 AM GMT
ఫ్యామిలీ మ్యాన్-2 వివాదంపై తమిళ తంబీలు సైలెంట్ అయినట్లేనా..?
X
అక్కినేని సమంత డెబ్యూ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' నిన్న గురువారం రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సిరీస్ ప్రశంసలు దక్కించుకుంటోంది. ఫస్ట్ సీజన్ కు ఏ మాత్రం తగ్గకుండా దర్శకద్వయం రాజ్ & డీకే.. ఆద్యంతం ఆసక్తికరంగా థ్రిల్లింగ్ గా ఈ సీజన్ ని మలిచారు. ఇక ఇందులో మనోజ్ బాజ్ పాయ్ కి ధీటుగా నిలిచిన సమంత పెర్ఫార్మన్స్ ను ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. అయితే 'ఫ్యామిలీ మ్యాన్ 2' రిలీజ్ కు ముందు తమిళ తంబీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా ఈ సిరీస్ ఉందా?, సామ్ పాత్రపై వారు ఎలా స్పందిస్తున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

'ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ చూసిన తర్వాత తమ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయంటూ తమిళులు ఈ సిరీస్ పై విమర్శలు చేశారు. తమిళుల హక్కుల కోసం పోరాడిన తమిళ టైగర్స్ కు ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులున్నట్లు చూపించారని.. ఈ సిరీస్ ని బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో నిజంగానే ఇందులో ఎల్టీటీఈ సంస్థను చెడుగా చూపించే ప్రయత్నం చేశారా అనే సందేహం అందరిలో ఉంది. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ చూసిన తర్వాత తమిళ టైగర్లను తప్పుగా చూపించలేదని అర్థం అయింది. ఓవిధంగా శ్రీలంక ఆర్మీ అకృత్యాలను చూపిస్తూ తమిళ శరణార్థుల కష్టాలని చూపించే ప్రయత్నం చేశారు. భారత - శ్రీలకన్ ప్రభుత్వాల స్ట్రాటజీలు కూడా ఎల్టీటీఈ సభ్యులపై సానుభూతి కలిగించేలా ఉన్నాయి.

అలానే సమంత పోషించిన ఎల్టీటీఈ సభ్యురాలు రాజీ పాత్ర ద్వారా ఆడవారిపై వాళ్ళు జరిపిన అత్యాచారాల గురించి ప్రస్తావించారు. ఎల్టీటీఈ సంస్థ వేరే రాజ్యం కోసం చేసిన పోరాటాన్ని లోతుగా కాకపోయినా కొంత మేర చూపించారు. వాళ్ళ పోరాటాన్ని కూడా ఎక్కడా తక్కువ చేయలేదు. దీనిని బట్టి చూస్తే తమిళులు 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ విషయంలో సైలెంటుగానే ఉండే అవకాశం ఉంది. ఎల్టీటీఈ సభ్యుడు పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పని చేసినట్లు అనుకోవడానికి.. అతను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడు అనే విధంగా చూపించారు. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో కూడా దీనిపై తమిళులు మళ్ళీ అభ్యంతరం చెప్పలేదు. ఏదేమైనా తెలుగు తమిళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.