Begin typing your search above and press return to search.

అవే రాజ‌మౌళిని శిఖ‌రాగ్రాన నిల‌బెట్టాయా?

By:  Tupaki Desk   |   10 Oct 2022 9:30 AM GMT
అవే రాజ‌మౌళిని శిఖ‌రాగ్రాన నిల‌బెట్టాయా?
X
రాజ‌మౌళి. యావ‌త్ ఇండియా మాత్ర‌మే కాకుండా 'RRR'తో హాలీవుడ్ లోనూ మారు మ్రోగుతున్న పేరిది. ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టుగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పొలిటికల‌ఖ‌ ప్ర‌క‌ట‌న‌ల‌తో మొద‌లైన రాజ‌మౌళి కెరీర్ రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో యావ‌త్ ప్ర‌పంచం అబ్బుర ప‌రిచే సినిమాలు తెర‌కెక్కించే స్థాయికి చేర‌డం వెన‌క ఎంతో కృషి, ప‌ట్టుద‌ల వున్నాయి. క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్ లో జ‌న్మించిన రాజ‌మౌళి అస‌లు పేరు శ్రీ‌శైల శ్రీ రాజ‌మౌళి. నేడు ఆయ‌న పుట్టిన రోజు.

ఫ్యామిలీ అంతా రాయ‌చూర్ లో వుంటే రాజ‌మౌళి మాత్రం చిన్న‌త‌నం నుంచి ఏపీలోని కొవ్వూరులో త‌న నాన‌మ్మ వ‌ద్ద వుండేవాడ‌ట‌. త‌న వ‌ల్లే రాజ‌మౌళికి పుస్థ‌క ప‌ఠ‌నంపై ఆస‌క్తి పెరిగింద‌ట‌. 'ఏదైనా పుస్త‌కం చ‌దువు లేదా ఆడుకో కానీ ఖాలీగా మాత్రం వుండ‌కు' అని నాన‌మ్మ చెప్పిన మాట‌ల‌తో రాజ‌మౌళిలో పుస్త‌క ప‌ఠ‌నంపై ఆస‌క్తి మొద‌లైంద‌ట‌. అప్ప‌టి నుంచి కొవ్వూరు గ్రంథాల‌యంలో అమ‌ర చిత్ర‌క‌థ‌లు, బాల భార‌తం, రామాయ‌ణం, బాల భ‌గ‌వ‌తం వంటివి చ‌దువుతూ కొత్త ప్ర‌పంచంలో విహ‌రించేవార‌ట‌. చిన్న త‌నం నుంచే స్నేహితుల‌కు తాను చూసిన సినిమాలు, పుస్త‌కాల్లోని క‌థ‌ల‌ని త‌న స్టైల్లో చెబుతూ ఆక‌ట్టుకోవ‌డం మొద‌లు పెట్టార‌ట‌.

రాజ‌మౌళి బాల్యం దాదాపుగా ఫ్యామిలీకి దూరంగా నానమ్మ‌, అత్త‌య్య‌ల‌తోనే సాగింది. ఇంట‌ర్మీడియ‌ట్ స‌మ‌యంలో చెన్నైకి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కోసం వెళ్లిన రాజ‌మౌళి ఆయ‌న స‌ల‌హాతో తిరిగి ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ద్ద అసిస్టెంట్ ఎడిట‌ర్ గా చేరార‌ట‌. కొద్ది రోజులకే తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కు ర‌చ‌యిత‌గా మంచి పేరు రావ‌డంతో తిరిగి ఆయ‌న వ‌ద్ద అసిస్టెంట్ గా మారారు రాజ‌మౌళి. చిన్న‌త‌నం నుంచి క‌థ‌లు చెప్ప‌డంలో దిట్ట అనిపించుకున్న రాజ‌మౌళిని అదే ద‌ర్శ‌కత్వ శాఖ వైపు అడుగులు వేసేలా చేసింద‌ట‌.

తండ్రి వ‌ద్ద వుంటే త‌న‌కు వ్య‌క్తిగ‌త గుర్తింపు ల‌భించ‌ద‌ని గ్ర‌హించిన రాజ‌మౌళి చెన్నై నుంచి త‌న మ‌కాంని మ‌ళ్లీ హైద‌రాబాద్ కు మార్చేశార‌ట‌. గుణ్ణం గంగ‌రాజు ఇంట్లో వుంటూ ద‌ర్శ‌కుడు చంద్ర శేఖ‌ర్ ఏలేటితో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌టంతో ఇద్ద‌రు క‌లిసి కె. రాఘ‌వేంద్ర రావు వ‌ద్ద శిష్యులుగా చేరార‌ట‌. అదే రాజ‌మౌళి జీవితాన్ని మ‌రో మ‌లుపు తిప్పింది. రాఘ‌వేంద్ర‌రావు వ‌ద్ద పొలిటిక‌ల్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఆయ‌న‌ని మెప్పించిన రాజ‌మౌళికి 'శాంతినివాసం' సీరియ‌ల్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ల‌భించింది. ఆ త‌రువాత 'స్టూడెంట్ నెం.1'తో ద‌ర్శ‌కుడిగా మారినా ఆ క్రెడిట్ రాఘ‌వేంద్ర‌రావుకే ద‌క్క‌డంతో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ డ్రామాగా 'సింహాద్రి'ని తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్నారు.

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 'బాహుబ‌లి'ని తెర‌కెక్కించిన అసాధ్యం అనుకున్న ఫీట్ ని సుసాధ్యం చేయ‌డ‌మే కాకుండా ప్ర‌పంచ య‌వ‌నిక‌పై టాలీవుడ్ జెండా స‌గ‌ర్వంగా రెప రెప‌లాగేలా చేశారు. రీసెంట్ గా చేసిన 'RRR'తో హాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా నిలిచి భారతీయ సినిమా గ‌ర్వించే ద‌ర్శ‌కుడిగా శిఖ‌రాగ్రాన నిలిచారు. చిన్న‌త‌నంలో స్నేహితుల‌కు క‌థ‌లు చెప్పిన రాజ‌మౌళి భారీ కాన్వాస్ పై అద్భుత‌మైన క‌థ‌ల‌ని ఆవిష్కరించ‌డానికి ఆయ‌న నానమ్మ చెప్పిన మాట‌లే ఇప్ప‌డు యావ‌త్ ఇండియా గర్వ‌ప‌డే ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళిని శిఖ‌రాగ్రాన నిల‌బెట్టాయి. 12 సినిమాల‌తో ఇండియా గ‌ర్వ‌ప‌డే ద‌ర్శ‌కుడిగా జేజేలు అందుకుంటున్నారు.

అన్నీ అనుకూలిస్తే ఎన్నో ఏళ్లుగా యావ‌త్ భార‌తీయులు ఎదురు చూస్తున్న ఆస్కార్ క‌ల‌ని కూడా 'RRR'తో రాజ‌మౌళి నిజం చేసే అవ‌కాశం వుంది. అదే జ‌రిగితే రాజ‌మౌళి ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే సువ‌ర్ణాక్ష‌రాల‌తో స‌రికొత్త చరిత్ర‌ను లిఖించ‌డం ఖాయం. 'RRR'ని ప‌లు విభాగాల్లో ఆస్కార్ బ‌రిలో నిల‌పాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.