Begin typing your search above and press return to search.

ఆ మాట‌లే సాయి ప‌ల్ల‌వికి షాకివ్వ‌బోతున్నాయా?

By:  Tupaki Desk   |   19 July 2022 3:30 AM GMT
ఆ మాట‌లే సాయి ప‌ల్ల‌వికి షాకివ్వ‌బోతున్నాయా?
X
అత్యుత్త‌మ న‌ట‌న‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది సాయి ప‌ల్ల‌వి. `ప్రేమ‌మ్‌`లో మ‌ల‌ర్ గా పాపుల‌ర్ అయిన ఈ త‌మిళ పొన్ను `ఫిదా` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసింది. భానుమ‌తి ఒక్క‌టే పీస్ అంటూ త‌న‌దైన స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని విమర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది న‌టించిన `విరాట‌పర్వం`తో న‌టిగా మ‌రిన్ని ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. రానా హీరోగా వేణు ఊడుగుల తెర‌కెక్కించిన ఈ మూవీ ఇటీవ‌ల విడుద‌లై మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

కానీ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం టాక్ కు త‌గ్గ‌ట్టుగా వ‌సూళ్ల‌ని మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఈ చిత్రంలో త‌ను ప్రేమించిన వ్య‌క్తిని వెతుక్కుంటూ ఉద్య‌మ‌బాట ప‌ట్టిన యువ‌తిగా క‌నిపించి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

ఈ మూవీని చూసిన వారంతా సాయి ప‌ల్ల‌వికి నేష‌న‌ల్ అవార్డ్ గ్యారంటీ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక ఈ సినిమా థియేట‌ర్ల‌లోంచి వెళ్లిపోయిన వెంట‌నే మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది సాయి ప‌ల్ల‌వి.

త‌ను న‌టించిన లేటెస్ట్ మూవీ `గార్గీ`. త‌మిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో విడుద‌ల చేశారు. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో ఓ సాధ‌ర‌ణ స్కూల్ టీచ‌ర్ పాత్ర‌లో న‌టించింది. త‌న తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేసిన పోలీసుల‌పై పోరాడే యువ‌తిగా సాయి ప‌ల్ల‌వి న‌టించిన తీరుకు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఈ మూవీకి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ మూవీతో సాయి ప‌ల్ల‌వి ఈ ఏడాది నేష‌న‌ల్ అవార్డ్ ని సొంతం చేసుకోవ‌డం ఖాయం అని అంతా యునానిమ‌స్ గా చెబుతున్నారు. త‌మిళ మీడియాలో ఈ వార్త ప్ర‌ధానంగా వినిపిస్తోంది. అయితే ఇంత అంత ఈజీగా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని మ‌రి కొంత మంది వాదిస్తున్నారు. `విరాట‌ప‌ర్వం` సినిమా రిలీజ్ స‌మ‌యంలో సాయి ప‌ల్ల‌వి క‌శ్మీర్ పండిట్ ల హ‌త్య‌ల‌ని, గో హ‌త్య‌ల‌తో పోలుస్తూ చేసిన వ్యాఖ్య‌లు వివాదంగా మారిన విష‌యం తెలిసిందే.

ఈ వ్యాఖ్య‌ల‌పై భ‌జ‌రంగ్ ద‌ళ్ వ‌ర్గాలు, బీజేపీ నాయ‌కులు సాయి ప‌ల్ల‌విపై కేసులు పెట్టారు. హైద‌రాబాద్ సుల్తాన్ బ‌జార్ పీఎస్ లో కేసు న‌మోదు చేశారు. ఆ త‌రువాత సాయి ప‌ల్ల‌వికి నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై హై కోర్టుని ఆశ్రియించింది. అయితే సాయి ప‌ల్ల‌వి పిటీష‌న్ ని స్వీక‌రించ‌డానికి హై కోర్టు నిరాక‌రించి షాకిచ్చింది. ఈ వివాదం నేప‌థ్యంలో సాయి ప‌ల్ల‌వికి నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్క‌డం క‌ష్ట‌మే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.