Begin typing your search above and press return to search.

తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

By:  Tupaki Desk   |   22 Oct 2022 10:30 AM GMT
తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?
X
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా ఇంగ్లీష్ టైటిల్స్ సందడి కనిపిస్తోంది. తెలుగులో రూపొందే చిత్రాలకు ఆంగ్ల టైటిల్స్ పెడుతున్నారు. నిజానికి ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. చాలా కాలం నుంచే తెలుగు సినిమాల్లో ఉంది. కాకపోతే పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకూ అందరూ అలాంటి టైటిల్స్ తోనే వస్తుండటంతో ఇప్పుడు టాపిక్ అయింది.

అప్పట్లో తెలుగు సినిమా అంటే అచ్చమైన తెలుగు పేర్లనే టైటిల్స్ గా పెట్టేవారు. దర్శక నిర్మాతలు - హీరోలు వాటికే మొగ్గు చూపేవారు. కానీ తర్వాతి రోజుల్లో హిందీ పదాలను.. తెలుగు - ఇంగ్లీష్ పదాల కలయికతో టింగ్లీష్ వర్డ్స్ ని టైటిల్స్ గా పెట్టడం ప్రారంభించారు. రాను రాను పూర్తిగా ఇంగ్లీష్ పదాలనే సినిమాలకు టైటిల్స్ గా పెడుతూ వచ్చారు.

ఇంటర్నెర్ అందరికీ అందుబాటులోకి వచ్చి, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత.. తెలుగు పదాలే అనుకునేంతగా ఇంగ్లీష్ పదాలు మన వాడుక భాషలో భాగమయ్యాయనే సంగతి తెలిసిందే. అందుకే ఫిలిం మేకర్స్ అంతా ఆ పదాలను టైటిల్స్ గా పెట్టడానికి వెనకాడటం లేదు.

తెలుగు చిత్ర పరిశ్రమల్లో గత కొన్నేళ్లలో అనేక ఇంగ్లీష్ టైటిల్స్ తో రూపొందిన సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని హిట్టయితే.. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఆ ట్రెండ్ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఇక పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలైన తర్వాత అది మరీ ఎక్కువైపోయింది.

యూనివర్సల్ అప్పీల్ కోసం మేకర్స్ అంతా అలాంటి టైటిల్స్ కే మొగ్గు చూపుతున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఒకే టైటిల్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలను గమనిస్తే.. ఆంగ్ల టైటిల్స్ తో రూపొందినవి ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయని అనిపిస్తోంది.

సీనియర్ హీరో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ ఏడాది ప్రారంభంలో 'సన్నాఫ్ ఇండియా' అంటూ డిజాస్టర్ అందుకున్నారు. సమ్మర్ తర్వాత ఉస్తాద్ హీరో రామ్ పోతినేని 'ది వారియర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు తమిళ భాషల్లో రిలీజైన ఈ మూవీ ప్లాప్ అయ్యుంది.

యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన 'థాంక్యూ' సినిమా తీవ్ర నిరాశ పరిచింది. ఇటీవల కింగ్ అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోలేకపోయింది.

విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కలిసి చేసిన 'ఎఫ్ 3: ఫన్ అండ్ ఫస్ట్రేషన్' సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. అనుదీప్ కేవీ అందించిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమా పరాజయం పాలైంది. ఇప్పుడు లేటెస్ట్ గా శివ కార్తికేయన్ తో చేసిన 'ప్రిన్స్' చిత్రానికి కూడా మిశ్రమ స్పందన వచ్చింది.

రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' - తాప్సి 'మిషన్ ఇంపాజిబుల్' - కీర్తి సురేష్ 'మిస్ ఇండియా' & 'గుడ్ లక్ సఖి' - దిల్ రాజు వారసుడి 'రౌడీ బాయ్స్' - మెగా అల్లుడి 'సూపర్ మచ్చి' - మహేష్ బాబు మేనల్లుడి 'హీరో' - లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే' వంటి సినిమాలు కూడా ప్లాప్స్ గా మిగిలిపోయాయి.

ఎమ్మెస్ రాజు '7 డేస్ 6 నైట్స్' తో పాటుగా 'వర్జిన్ స్టోరీ' - 'టెన్త్ క్లాస్ డైరీస్' - 'హైవే' - 'ది అమెరికన్ డ్రీమ్' - 'BHF బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' - 'హై ఫై' వంటి చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన సినిమాల్లో మెజారిటీ భాగం పరాజయం చవిచూసినవే ఉన్నాయి.

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇదంతా చూస్తుంటే తెలుగు సినిమాలకు ఇంగ్లీషు టైటిల్స్ కలిసి రావడం లేదనిపిస్తోంది. రాబోయే రోజుల్లో 'లైక్ షేర్ సబ్ స్క్రైబ్' 'హంట్' 'హిట్: ది సెకండ్ కేస్' 'సార్' 'ఏజెంట్' వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి వీటిల్లో ఏయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.