Begin typing your search above and press return to search.

నిన్న అర్జున్ రెడ్డి.. నేడు రంగస్థలం.. రేపు?

By:  Tupaki Desk   |   1 April 2018 11:16 AM GMT
నిన్న అర్జున్ రెడ్డి.. నేడు రంగస్థలం.. రేపు?
X
టాలీవుడ్లో క్లాసిక్ గా నిలిచిపోయిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా నిడివి దాదాపు 3 గంటలు. ఇక కొన్నేళ్ల కిందట రిలీజై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ లెంగ్త్ కూడా దాదాపు అంతే ఉంటుంది. కానీ ఈ మధ్య మాత్రం రెండున్నర గంటల నిడివి అన్నా కూడా వామ్మో అనేస్తున్నారు. ఇప్పుడు సినిమాల నిడివి 2 నుంచి 2 గంటల 15 నిమిషాలే ఉంటుంది. మహా అయితే రెండున్నర గంటల దాకా వెళ్తున్నారు. అంతకుమించి నిడివి అంటే భయపడుతున్నారు. ఎక్కడ జనాలు ల్యాగ్ అంటారేమో అని భయపడుతున్నారు.

కానీ గత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమా 3 గంటలకు పైగా నిడివితో థియేటర్లలోకి దిగింది. ఆ విషయంలో చాలా మంది ఆందోళన వ్యక్తం చేసినా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తగ్గలేదు. అయితే ఈ సినిమాకు నిడివి అనేది ఎంతమాత్రం మైనస్ కాలేదు. జనాలు ఏ ఇబ్బందీ లేకుండా సినిమా చూశారు. దానికి అద్భుత విజయం కట్టబెట్టారు. ఇప్పుడు సుకుమార్ కూడా ఇలాంటి సాహసమే చేశాడు. ‘రంగస్థలం’ను దాదాపు 3 గంటల నిడివితో రిలీజ్ చేశాడు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవే అండగా నిలిచాడు. సినిమా చూసిన ఆయన ఒక్క సీన్ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదన్నాడు.

దీంతో అలాగే సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు కూడా నిడివి బలహీనత ఏమీ కాలేదు. ద్వితీయార్ధం కొంచెం సాగతీతగా అనిపించినప్పటికీ అదేమీ సినిమాకు ప్రతికూలంగా మారలేదు. సినిమా అద్భుతంగా ఆడేస్తోంది. రామ్ చరణ్-సుకుమార్ లాంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఇంత నిడివితో రిలీజై విజయం సాధించిన నేపథ్యంలో మిగతా ఫిలిం మేకర్లకు ధైర్యం వస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి మున్ముందు పాత ట్రెండ్ వచ్చి పెద్ద సినిమాలు వరుస కడతాయేమో.