Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి.. దంచి కొడుతున్నాడే

By:  Tupaki Desk   |   8 Aug 2017 9:54 AM GMT
అర్జున్ రెడ్డి.. దంచి కొడుతున్నాడే
X
విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’ విడుదల కాకముందే మొదలైన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా మొదలయ్యే సమయానికి విజయ్ పేరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. దీని దర్శకుడూ కొత్త వాడే. హీరోయినూ కొత్తమ్మాయే. ఈ సినిమాకు సంబంధించి ఏ ఆకర్షణా లేదు. కానీ ఇప్పుడు చూస్తే ‘అర్జున్ రెడ్డి’ ఓ పెద్ద సినిమా స్థాయిలో చర్చనీయాంశమవుతోంది.

రెండు రోజుల కిందట రిలీజైన ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. రెండు రోజులుగా యూట్యూబ్ లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతున్న తెలుగు వీడియో ఇదే కావడం విశేషం. రెండు రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసిన ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్.. ఓవరాల్ గా 3 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ పూర్తి చేసుకుంది. ఆర్నెల్ల కిందట రిలీజైన ‘అర్జున్ రెడ్డి’ టీజర్ కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

ఐతే అది గాలివాటం అనుకున్న వాళ్లకు ట్రైలర్ సమాధానం చెప్పింది. ఇది యూత్ ఆడియన్స్ ను మరింతగా ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ.. ముందుగా యువ ప్రేక్షకుల్లో ఈ సినిమా విపరీతమైన క్యూరియాసిటీని తీసుకొచ్చిందన్నది మాత్రం వాస్తవం. ట్రైలర్ ఒకసారి చూసి ఆగిపోయేలా లేకపోవడం దీని ప్రత్యేకత. మళ్లీ మళ్లీ చూసేలా ట్రైలర్ ను చాలా విభిన్నంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ఓవరాల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఏమో కానీ.. ఓపెనింగ్స్ మాత్రం ఊహించని స్థాయిలోనే రావచ్చని అంచనా వేస్తున్నారు.