Begin typing your search above and press return to search.

రంగస్థలం కష్టం కాదు సాహసం

By:  Tupaki Desk   |   22 March 2018 6:14 AM GMT
రంగస్థలం కష్టం కాదు సాహసం
X
సరిగ్గా మరో వారం రోజుల్లో రానున్న రంగస్థలం కోసం మెగా ఫాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పల్లెటూరి నేపధ్యంలో స్టార్ హీరోలు సినిమాలు చేసి చాలా కాలమయ్యింది. ఎంత సేపూ హీరో మల్టీ మిలియనీర్ గానో లేక పెద్ద హోదా ఉన్న వాడిగానో చూపడం తప్ప గ్రామీణ వాతావరణంలో వెండితెర ఈ మధ్య కనిపించలేదన్నది నిజం. అందుకే రంగస్థలం గురించి అంత హైప్ నెలకొంది. దానికి తోడు పోస్టర్లు మొదలుకొని ట్రైలర్ - ఆడియో దాకా అన్ని అంచనాలకు తగ్గట్టే ఉండటం కూడా ప్లస్ గా మారింది . ఇక సినిమాలో అందరిని బాగా ఆకట్టుకుంటున్న విషయం అందులో ఆర్ట్ డైరెక్షన్. ముప్పై ఏళ్ళ వెనక్కు ప్రేక్షకులను తీసుకెళ్ళేలా అప్పటి గ్రామాన్ని పునఃసృష్టించడం అంటే మాటలు కాదు. ఇందులో కళా దర్శకులు రామకృష్ణ - ఆయన భార్య మౌనిక పోషించిన పాత్ర జాతీయ మీడియాను సైతం ఆకట్టుకుంది.

రంగస్థలం గ్రామాన్ని సెట్ వేయటం కోసం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని ఎందరో ప్రజలను కలిసామని, ఆ టైంలో యువకులుగా ఉన్నవాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకుని అప్పటి పద్దతులు అలవాట్లు క్షుణ్ణంగా తెలుసుకుని స్కెచ్చులు వేసుకుని మరీ ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్నామని చెప్పారు. ఇప్పటి తరానికి అవగాహన లేని ఒక గ్రామాన్ని సృష్టించడం అంటే అందరు కష్టమనుకుంటారని కాని అది సాహసమని ఆయన స్పష్టం చేసారు. గతంలో గోపీచంద్ సాహసం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రామకృష్ణ-మౌనిక జంట పాకిస్తానీ వాతావరణాన్ని రీ క్రియేట్ చేసి అబ్బుర పరిచారు. ఇప్పటికీ తమ బెస్ట్ వర్క్ అదే అంటున్నారు ఈ ఆర్ట్ కపుల్.

ఈ నేపధ్యంలో రంగస్థలం అన్నిరకాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి పీరియడ్ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది కనక ఆ రకంగా తాము దీన్నొక ఛాలెంజ్ గా తీసుకుని నేరవేర్చామని చెబుతున్న రామకృష్ణ త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న సంకల్ప్ రెడ్డి సినిమాతో పాటు బాలయ్య నటించబోయే ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు కూడా తీసుకున్నారు.