Begin typing your search above and press return to search.

ఇదంతా వర్మగారి చలవేనన్న 'పుష్ప' ఫ్రెండు!

By:  Tupaki Desk   |   11 Jan 2022 12:30 AM GMT
ఇదంతా వర్మగారి చలవేనన్న పుష్ప ఫ్రెండు!
X
'పుష్ప' సినిమా విడుదలకి ముందు పోస్టర్లు చూసినవాళ్లు, ఈ సినిమాతో సునీల్ .. అనసూయలకు మరింత పేరు వచ్చేస్తుందని అనుకున్నారు. ఇక డీ గ్లామర్ రోల్ చేసిన రష్మిక మరిన్ని మార్కులు కొట్టేయడం ఖాయమని చెప్పుకున్నారు. కానీ విడుదలైన తరువాత వీళ్లెవరి పేర్లు పెద్దగా వినిపించలేదు. అందరి నోళ్లలో ఒక పాత్ర పేరు మాత్రమే నానింది ... ఆ పాత్ర పేరే కేశవ. ఆ పాత్రను పోషించిన ఆర్టిస్ట్ పేరు జగదీశ్. సినిమా రిలీజ్ తరువాత ఎక్కడ .. ఏ ఛానల్ లో చూసినా ఆయన ఇంటర్వ్యూలే. యూ ట్యూబ్ ఛానల్స్ లోను ఆయన సందడే కనిపిస్తూ వచ్చింది.

జగదీశ్ వరంగల్ కుర్రాడు .. తండ్రి పోస్ట్ మేన్ .. తల్లి వ్యవసాయ పనులు చేస్తూ ఉంటుంది. జగదీశ్ ఇంతకుముందు చిన్న చిన్న పాత్రలు వేసినప్పటికీ అవి ఇప్పుడు ఆయన చెబితేనే గుర్తుకు వస్తాయి. వరంగల్ నుంచి వచ్చిన జగదీశ్ మాస్ లుక్ తో ఉంటాడు. సినిమాల వైపుకు ఎందుకు రావాలనిపించింది? ఇంత పట్టుదలగా ఇక్కడే ఉంటూ ప్రయత్నాలు ఎందుకు చేయాలనిపించింది? అనే మాటకు సమాధానంగా ఆయన వర్మ పేరు చెప్పాడు. ఆయన మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అందువలన నా ధ్యాస అంతా కూడా సినిమాలపైనే ఉండేది. సినిమాల గురించే ఆలోచిస్తూ ఉండేవాడిని.

అలాంటి పరిస్థితుల్లోనే 'వోడ్కా విత్ వర్మ' అనే పుస్తకం చదివాను. అందులో ఒక చోట "నటన అంటే అనుభవం కాదు .. దానికి పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఒక విజన్ .. చేయాలనే కసి .. నీమీద నీకు నమ్మకం ఉంటే యాక్టింగ్ పెద్ద కష్టమేమీ కాదు" అని వర్మ చెప్పిన మాటలు నాపై చాలా ప్రభావం చూపాయి. అంతే ఆ వెంటనే అప్పుచేసి మరీ షార్ట్ ఫిల్మ్ తీశాను .. అది నాపై నాకున్న నమ్మకాన్ని మరింత పెంచింది. 'నిరుద్యోగ నటులు' అనే వెబ్ సిరీస్. 'మల్లేశం' .. 'పలాస' సినిమాలు నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

'పుష్ప' సినిమా సమయంలో కొన్ని వెబ్ సిరీస్ ల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ 'పుష్ప'లోని పాత్రపై గల నమ్మకంతో వాటిని వదులుకున్నాను. ఈ పాత్ర నన్ను ఎక్కడికో తీసుకెళుతుందని ముందుగానే నాకు బన్నీ సార్ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మా ఊళ్లో మా ఫ్యామిలీతో కలిసి నేను ఈ సినిమాను చూశాను. అంతా నాతో సెల్ఫీలు దిగడం చూసి, మా అమ్మానాన్నలు చాలా సంతోషపడ్డారు. అప్పటివరకూ నేను పడుతూ వచ్చిన కష్టాలను ఆ క్షణంలో మరిచిపోయాను" అంటూ చెప్పుకొచ్చాడు.