Begin typing your search above and press return to search.

పాత సినిమాపై కొత్తగా వివాదం

By:  Tupaki Desk   |   17 Aug 2021 11:30 AM GMT
పాత సినిమాపై కొత్తగా వివాదం
X
ఆర్య ప్రధాన పాత్రలో పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన 'సార్పట్ట పరంపర' సినిమా థియేటర్లు ఓపెన్ లేని కారణంగా ఓటీటీ ద్వారా డైరెక్ట్‌ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న సార్పట్ట పరంపర అమెజాన్ లో విడుదల అయిన సమయంలో మంచి స్పందన వచ్చింది. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తమిళ సాంప్రదాయ ఆటను విభిన్నంగా చూపించడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించేలా మంచి కాన్సెప్ట్‌ తో సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో బాక్సింగ్ ప్రధానంగా కథ సాగుతుంది. సినిమాలో కాస్త రాజకీయ రంగును కూడా పులమడం జరిగింది.

సినిమా విడుదల అయ్యి వారాలు గడిచి పాత సినిమా అయ్యింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు అన్నాడీఎంకే నాయకుడు డి జయకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో ఎంజీఆర్‌ ను తప్పుగా చూపించారని.. సార్పట్ట సినిమా యూనిట్ సభ్యులు ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే అంటూ నోటీసులు పంపించారు. చిత్రంలోని పలు సన్నివేశాల్లో ఎంజీఆర్‌ ను తప్పుడు ఉద్దేశ్యాలతో చూపించి రాజకీయంగా ఆయనకు తప్పుడు పేరు వచ్చేలా చేశారంటూ ఆయన ఆరోపించాడు. అన్నాడీఎంకే నాయకుడు అయిన ఎంజీఆర్‌ ఎన్నో క్రీడా కార్యక్రమాలను తన హయాంలో నిర్వహించారని జయకుమార్ అన్నాడు.

ఎంజీఆర్‌ నిజమైన క్రీడాకారుడు. మహ్మద్‌ అలీ వంటి గొప్ప బాక్సర్లను తీసుకు వచ్చి రాష్ట్రంలో బాక్సింగ్ క్రీడకు మంచి పేరు తెచ్చి పెట్టాడు. సీనియర్ లుగా ఇప్పుడు మంచి పేరు దక్కించుకున్న ఎంతో మందికి ఫిట్ నెస్ విషయంలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఎంతో మందిని ప్రోత్సహించి మంచి భవిష్యత్తును అందించాడు. అలాంటి వ్యక్తి ని ఈ సినిమాలో తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు అంటూ అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశాడు. ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించకుంటే చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించాడు.