Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ కోసం బాలీవుడ్ కెమెరామెన్

By:  Tupaki Desk   |   10 Feb 2016 7:30 PM GMT
చ‌ర‌ణ్ కోసం బాలీవుడ్ కెమెరామెన్
X
స్టైలిష్ డైరెక్ట‌ర్‌ గా పేరు తెచ్చుకున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఆయ‌న సినిమాల్లో క‌థానాయ‌కులు య‌మా ట్రెండీగా - స్టైలిష్‌ గా క‌నిపిస్తుంటారు. అందుకే స‌క్సెస్‌ లు - ఫెయిల్యూర్ ల‌తో సంబంధం లేకుండా సురేంద‌ర్ రెడ్డితో సినిమాలు చేసేందుకు ముందుకొస్తుంటారు స్టార్ క‌థానాయ‌కులు. కిక్‌2లాంటి ఫెయిల్యూర్ త‌ర్వాత కూడా సురేంద‌ర్ రెడ్డితో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు రామ్‌ చ‌ర‌ణ్‌. తమిళ చిత్రం త‌ని ఒరువ‌న్‌ కి రీమేక్‌ గా ఆ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. రీమేకే అయినప్ప‌టికీ సురేంద‌ర్ రెడ్డి సినిమాలో త‌న స్టైల్ ఆఫ్ మేకింగ్ ప‌క్కాగా ఉండేలా చూసుకొంటున్నాడు. ఒక స్ట్రెయిట్ ఫిల్మ్ త‌ర‌హాలోనే ఉండేలా స్క్రిప్టు త‌యారు చేసుకొన్నాడు. చ‌ర‌ణ్‌ కి ఇప్ప‌టిదాకా స్టైలిష్‌ గా చూపించిన‌వాళ్లు లేరు. ఆరెంజ్‌ లో కాస్త ఫ‌ర్వాలేద‌నిపించాడంతే. సురేంద‌ర్‌ రెడ్డి ఆ పార్ట్‌ మీదే దృష్టిపెట్టి ఇప్పుడు త‌ని ఒరువ‌న్‌ ని రీమేక్ చేస్తున్నాడు.

అందుకోసం బాలీవుడ్‌ కి చెందిన ప్ర‌ముఖ కెమెరామెన్ అసీమ్ మిశ్రాని తీసుకొచ్చాడు. అసీమ్ మిశ్రా మామూలోడు కాదు. ఆయ‌న ట్రాక్ రికార్డ్ చూస్తే దిమ్మ తిరిగి పోతుంది. కాంట్రాక్ట్ సినిమాతో మొద‌లుపెడితే న్యూయార్క్ - బ్యాండ్ బాజా బారాత్‌ - వ‌న్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై - ద‌బాంగ్‌ - పాన్ సింగ్ తో మార్‌ - ఏక్ థా టైగ‌ర్‌ - భ‌జ‌రంగీ భైజాన్ వంటి ప‌లు సూప‌ర్‌ హిట్ సినిమాల‌కి ప‌నిచేశాడు. ఆయ‌న్ని ఏరికోరి ఎంపిక చేసుకొన్నాడు సురేంద‌ర్ రెడ్డి. పోలీసు డ్రెస్ వేసుకొంటే చ‌ర‌ణ్ అదుర్స్ అనేలా క‌నిపిస్తాడు. తుఫాన్‌ తో ఆ విష‌యం తెలిసొచ్చింది. ఇప్పుడు ఆ డ్రెస్‌కి సురేంద‌ర్ రెడ్డి హంగులు - ఆయ‌న స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా తోడ‌వుతోందంటే ఇక పీక్స్‌ లో ఊహించొచ్చు. ర‌క్ష‌క్ పేరుతో తెర‌కెక్కనున్న చెర్రీ - సురేంద‌ర్ రెడ్డిల సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది.