Begin typing your search above and press return to search.

ట్రైలర్: అశోకవనంలో తెలంగాణా అబ్బాయి - ఆంధ్రా అమ్మాయి కళ్యాణం..!

By:  Tupaki Desk   |   20 April 2022 11:38 AM GMT
ట్రైలర్: అశోకవనంలో తెలంగాణా అబ్బాయి - ఆంధ్రా అమ్మాయి కళ్యాణం..!
X
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ''అశోకవనంలో అర్జున కళ్యాణం''. విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ బుధవారం ట్రైలర్ ను విడుదల చేశారు.

'అశోకవనంలో అర్జున కళ్యాణం' ట్రైలర్ లో మాస్ కా దాస్ ను 'క్లాస్ కా దాస్' గా పరిచయం చేశారు. 33 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాని తెలంగాణా కుర్రాడు అర్జున్ కుమార్ అల్లం పాత్రలో విశ్వక్ సేన్ కనిపించారు. 'మా సూర్యాపేట మొత్తం ఒక్కటే టాపిక్.. అర్జున్ కుమార్ అల్లం గాడికి పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు' అని విశ్వక్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

అయితే సూర్యాపేట అర్జున్ కు ఆంధ్రాలోని గోదావరి అమ్మాయి పసుపులేటి మాధవితో పెళ్లి కుదిరింది. 'కుదిరింది.. కుదిరింది.. కుదిరింది పెళ్లి.. ముడ్డి కింద ముప్పై వచ్చినాక' అంటూ ఈ విషయాన్ని ఫన్నీ నోట్ లో చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. కథ అంతా హీరో వివాహం చుట్టూనే తిరుగుతుందని అర్థం అవుతుంది.

వేర్వేరు ప్రాంతాలు వేర్వేరు కులాలకు చెందిన హీరోహీరోయిన్ల వివాహం సెట్ అయిన తర్వాత.. అబ్బాయికి ముద్దు కూడా పెట్టిన తర్వాత ఎందుకనో ఆ అమ్మాయి ఈ పెళ్లంటే తనకు ఇష్టం లేదని చెబుతోంది. దీనికి వెనుక అసలు కారణమేంటి? తెలంగాణ అబ్బాయి - ఆంధ్రా అమ్మాయి ఒకటయ్యారా లేదా? అసలు అల్లం అర్జున్ కుమార్ కు పెళ్లైందా లేదా? అనేది తెలియాలంటే 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా చూడాల్సిందే.

ఇది రొమాన్స్ అండ్ ఎమోషన్స్‌ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో అర్జున్ గా విశ్వక్ నటన అలరిస్తోంది. 'నాకు ఇప్పుడు 33. ఇంకో మూడేళ్లు పోతే 36 వస్తుంది. ముప్పై ఆరేళ్ళు వస్తే పెళ్లి చేసుకోకూడదా? అది క్రైమా? తీసుకెళ్లి జైల్లో వేస్తారా నన్ను?' అంటూ ఎమోషనల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే విడుదలైన 'అశోకవనంలో..' ప్రచార చిత్రాలు - టీజర్ - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. 'రాజా వారు రాణి వారు' ఫేమ్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి కథ - స్క్రీన్‌ ప్లే - మాటలు అందించారు.

జై క్రిష్ సంగీతం సమకూర్చారు. పవి కె పవన్ సినిమాటోగ్రఫీ అందించగా.. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ చేసారు. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌ పై బాపినీడు - సుధీర్ ఈదర కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2022 మే 6న 'అశోకవనంలో..' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.