Begin typing your search above and press return to search.

వైజ‌యంతీ అధినేత ఎందుకీ సైలెన్స్?

By:  Tupaki Desk   |   16 Sep 2019 4:18 AM GMT
వైజ‌యంతీ అధినేత ఎందుకీ సైలెన్స్?
X
అశ్వ‌నీద‌త్‌. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ గా పేరు తెచ్చుకున్న ఆయ‌న హీరోలుగా ప‌రిచ‌యం చేసిన వార‌సులు ఎంద‌రో ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తారా స్థాయి స్టార్‌ డ‌మ్‌ ని సొంతం చేసుకుని ఇండ‌స్ట్రీని శాసిస్తున్నారు. కానీ ఆయ‌న మాత్రం త‌న ప్రాభ‌వాన్ని చాటుకోలేక పోతున్నారు. ర‌జ‌నీకాంత్‌ తో నిర్మించిన `కుచేల‌న్‌` రీమేక్ `క‌థానాయ‌కుడు` నుంచి భారీ న‌ష్టాల్ని చ‌విచూసి ఎన్టీఆర్ `శ‌క్తి` చిత్రంతో పీక‌ల్లోతు న‌ష్టాల్లో కూరుకుపోయిన ఆయ‌న ఇక సినిమాలు చేయ‌డం క‌ష్ట‌మే అన్నారంతా. త‌ను కూడా ఇక సినిమాల‌కు దూరంగా వుండాల్సిందేనా అనే సంద‌గ్ధంలో ప‌డిపోయారు.

ఆ ద‌శ‌లో వైజ‌యంతీ సంస్థ‌కు నూత‌న జ‌వ‌స‌త్వాల్నీ పూర్వ వైభ‌వాన్నీ అందించిన చిత్రం `మ‌హాన‌టి`. సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా మ‌లిచి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. న‌ట‌న తెలియ‌ద‌న్న కీర్తి సురేష్‌ లో మ‌హాన‌టి దాగుంద‌ని చాటి చెప్పాడు. ఇలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత అశ్వ‌నీద‌త్ మ‌ళ్లీ రెట్టించిన ఉత్సాహంతో చేసిన సినిమా `దేవ‌దాస్‌`. నాగార్జున‌ - నాని క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో వైజ‌యంతీ మూవీస్ భ‌వితవ్యం ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింద‌న్న గుసగుస‌లు ఫిలింన‌గ‌ర్ లో వినిపించాయి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్‌ తో భారీ సినిమా వుంటుంద‌ని.. మెగాస్టార్‌ - ప‌వ‌ర్‌ స్టార్‌ ల క‌ల‌యిక‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ వుంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఏదీ కార్యరూపం దాల్చ‌లేదు. రామ్ చ‌ర‌ణ్‌- జాన్వీల క‌ల‌యిక‌లో `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి`కి సీక్వెల్ చేస్తామ‌న్నారు కానీ ఎక్క‌డా ఆ ఊసే ఎత్త‌డం లేదు. త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా అని ప్ర‌క‌టించారు. కానీ దాని మాట కూడా వినిపించ‌డం లేదు ఎందుక‌నో? అస‌లేం జ‌రుగుతోంది? ఉన్న‌ట్టుండి అశ్వ‌నీద‌త్ లాంటి బ‌డా నిర్మాత ఎందుకు సైలెంట్ అయ్యారు?. ఇంత‌కీ ఆయ‌న నెక్ట్స్ సినిమా వుందా? లేదా? అని ఫిలిం స‌ర్కిల్స్‌ లో చ‌ర్చ జ‌రుగుతోంది.