Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ కీలక నిర్ణయం.. రెమ్యూనరేషన్ లో 20 శాతం కోత...!

By:  Tupaki Desk   |   3 Oct 2020 5:31 PM GMT
ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ కీలక నిర్ణయం.. రెమ్యూనరేషన్ లో 20 శాతం కోత...!
X
కరోనా మహమ్మారి కారణంగా షూటింగులు నిలిచిపోవడం.. థియేటర్ల మూతపడటం.. సినిమాలు వాయిదా పడటంతో సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అయితే ఈ మధ్య సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవడం.. అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి అనుమతులు లభించడం కాస్త ఊరట కలిగించే అంశం. అయినప్పటికీ నష్టాల నుంచి బయటపడటానికి ప్రొడ్యూసర్స్ కి చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్ విషయంలో యాక్టివ్‌ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌(ఏటీఎఫ్‌ పీజీ) కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారి పారితోషకాల్లో కోతలు విధిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్ లో 20 శాతం తగ్గిస్తున్నట్లు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రకటించింది. రోజుకు రూ. 20 వేలకు పైగా పారితోషికం తీసుకునే నటీనటులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. అలాగే ఒక సినిమాకు 5 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే టెక్నీషియన్లకు కూడా 20 శాతం కోత ఉంటుందని గిల్డ్ ప్రకటించింది. రోజుకు రూ.20 వేలలోపు తీసుకునే వారి పారితోషికాలు యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) మరియు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. రెమ్యూనరేషన్స్ తగ్గింపు నిర్ణయానికి సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ కోరింది. సినీ ఇండస్ట్రీకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని గిల్డ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.