Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల రైట్స్.. చుక్క‌ల్లో అవతార్ 2 రేటు!

By:  Tupaki Desk   |   6 Nov 2022 5:30 AM GMT
తెలుగు రాష్ట్రాల రైట్స్.. చుక్క‌ల్లో అవతార్ 2 రేటు!
X
తెలుగు రాష్ట్రాల్లో అవతార్2కి భారీ డిమాండ్ నెలకొంది. పాపుల‌ర్ హాలీవుడ్ నిర్మాత.. లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన‌ 2009 సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అవతార్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం హిందీ- తెలుగు- తమిళం వంటి డబ్బింగ్ వెర్షన్ ల‌తో ఇండియా వ‌సూళ్ల‌లో దుమ్ము దులిపింది. అప్పట్లోనే ఊహకు అందని రీతిలో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది.

ఇప్పుడు ఈ ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా రెండవ భాగం `అవతార్- ది వే ఆఫ్ వాటర్` డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైల‌ర్ ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. దానికి త‌గ్గ‌ట్టే బిజినెస్ కూడా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు.

ముఖ్యంగా అవతార్ 2 కి ఇండియాలో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంద‌నేది ఒక విశ్లేష‌ణ‌. ఇప్పుడు ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న తాజా సమాచారం ప్ర‌కారం.. అవతార్ నిర్మాతలు జంట తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కుల కోసం భారీ ధరలను కోట్ చేస్తున్నారని తెలిసింది. దాదాపు 150 కోట్లు చెల్లించాల‌ని రైట్స్ కోసం ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. అయితే తెలుగు పంపిణీ హక్కుల కోసం 100 కోట్ల నుంచి బేర‌సారాలు సాగిస్తున్నార‌ని.. నైజాం డీన్ ఏసియ‌న్ సునీల్ కొంద‌రు ఇత‌ర పంపిణీదారుల అల‌యెన్స్ తో డీల్ ని పూర్తి చేయాల‌ని చూస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త రియాలిటీగా మారితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.100 కోట్ల నుంచి 150కోట్ల‌ షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇది ఒక తెలుగు స్టార్ హీరో నుంచి కూడా ఊహించ‌లేం. కానీ ఒక డ‌బ్బింగ్ సినిమా రైట్స్ కి ఇంత రేటు పెడుతున్నారంటే నిజంగా షాకింగ్ విష‌య‌మే.

`అవతార్: ది వే ఆఫ్ వాటర్‌` తెలుగు ట్రైల‌ర్ ఇంత‌కుముందే రిలీజై హైప్ ని అమాంతం పెంచింది. ఇందులో సామ్ వర్తింగ్టన్- జో సల్దానా- స్టీఫెన్ లాంగ్,- మిచెల్ రోడ్రిగ్జ్ -సిగౌర్నీ వీవర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ట్వంటీయ‌త్ సెంచరీ ఫాక్స్ నిర్మించింది. దీనికి జేమ్స్ హార్నర్ సంగీతం అందించారు.

జేమ్స్ కామెరూన్ `అవతార్ 2` ప్రస్తుతం భారతదేశంలో మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ విడుదలగా సంచ‌ల‌నాలు సృష్టించ‌నుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొట్ట‌డం ఖాయ‌మ‌ని ప్రచారం సాగుతోంది. తాజా హైప్ ని పరిగణనలోకి తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్తుందో ఎవరికీ తెలియదు. భారతీయ మార్కెట్ లో అసాధార‌ణ‌ సందడిని పరిగణనలోకి తీసుకుంటే మేక‌ర్స్ నుంచి పంపిణీ హ‌క్కుల్లో డిమాండ్ కి షాక్ తింటున్నారు. హ‌క్కుల‌పై గుత్తేధారు పంపిణీదారుల నుండి అధిక ధరలను డిమాండ్ చేస్తున్నారు. ఈ రేట్ల‌కు మ‌తులు చెడుతున్నాయ‌న్న టాక్ వినిపిస్తోంది.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ అనేది 2009లో విడుదలైన అవతార్ కి సీక్వెల్. 13 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం భారతీయ మార్కెట్ లో హాలీవుడ్ సినిమాల‌ పాత‌ రికార్డుల‌న్నిటినీ తుత్తునియ‌లు చేసింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా ఇండియా నుంచే రాబట్టింది. గ్లోబల్ కలెక్షన్ ల‌లో నంబ‌ర్ వ‌న్ చిత్రంగా నిలిచింది. అవ‌తార్ 1 చిత్రం మొత్తం 2.92 బిలియన్ల డాల‌ర్ల‌తో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డుల‌కెక్కింది. రెండో రిలీజ్ లోను అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించిన చిత్రంగాను రికార్డుల‌కెక్కింది.

అదే క్ర‌మంలో భారతదేశంలో అవతార్ 2కి హైప్ ఆకాశాన్ని తాకింది. అలాగే పార్ట్ 2 రిలీజ్ ముందు ప్రీక్వెల్ రీ-రిలీజ్ కూడా గత నెలలో మంచి బిజినెస్ చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న మేకర్స్ థియేట్రికల్ రైట్స్ కోసం బ్లాక్ బస్టర్ ధరల‌ను కోట్ చేస్తున్నారు. మ‌రోవైపు ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణలలో థియేట్రికల్ హక్కుల కోసం.. డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా పోటీప‌డుతున్నారని స‌మాచారం ఉంది. ఏసియ‌న్ నారంగ్ స‌హా ప‌లువురు అగ్ర పంపిణీదారులు హ‌క్కుల కోసం పోటీప‌డుతున్నార‌ని స‌మాచారం.

ఒక అనువాద చిత్రం 100 కోట్లు పైగా వ‌సూలు చేయాలంటే చాలా పెద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించాల్సి ఉంటుంది. తొలిరోజు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో పాటు జ‌నాలు థియేట‌ర్ల‌కు పోటెత్తాలి. మ‌ల్టీప్లెక్సులను వ‌దిలేస్తే టూటైర్ సిటీల్లో సింగిల్ థియేట‌ర్ల‌ను బాగా పుల్ చేయాల్సి ఉంటుంది. కానీ అది జ‌రుగుతుందా? అన్న‌ది కొంత సందిగ్ధం. దీనిపైనే పంపిణీదారులు కొనుగోలుదారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌ట‌.