Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : అవతార్-2

By:  Tupaki Desk   |   16 Dec 2022 8:05 AM GMT
మూవీ రివ్యూ : అవతార్-2
X
అవతార్.. 13 ఏళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు నభూతో అనిపించే అనుభూతిని పంచుతూ అసాధారణ విజయాన్ని అందుకున్న చిత్రం. 'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కామెరూన్ దశాబ్ద కాలం పాటు శ్రమించి ఈ వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఆయన కష్టానికి తగ్గట్లే ప్రపంచ బాక్సాఫీస్‌ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది 'అవతార్'. ఆ విజయం తర్వాత దీని సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ఏకంగా 13 ఏళ్లు సమయం తీసుకున్నాడు కామెరూన్. రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆయన తీర్చిదిద్దిన ఈ విజువల్ వండర్ ఈ రోజే ఫ్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 'అవతార్' స్థాయిలో ఇది కూడా ప్రేక్షకులను అలరించేలా ఉందా లేదా? తెలుసుకుందాం పదండి.

'అవతార్-2' విశేషాల్లోకి వెళ్లే ముందు ఒకసారి 'అవతార్' సంగతులు గుర్తు చేసుకుందాం. మానవాళికి దూరంగా.. అద్భుత ప్రకృతి సౌందర్యం మధ్య పాండోరా అనే గ్రహంలో ఒక 'నావీ' విచిత్ర జాతి ఉన్న సంగతిని కనిపెట్టి.. తమకున్న సాంకేతికత ఆయుధ బలంతో వారిని అక్కడి నుంచి నిర్మూలించి ఆ గ్రహాన్ని కబళించాలని ప్రయత్నం చేస్తారు మనుషులు. తమకున్న ప్రత్యేక శక్తులతో.. సంకల్ప బలంతో మనుషులపై తిరగబడి అంతిమంగా ఈ పోరాటంలో విజయం సాధిస్తారు నావీలు. నావీల విజయంలో ఒక మనిషిది కీలక పాత్ర. తమ రహస్యాలు తెలుసుకునేందుకు తమ అవతారంలోకి మారి పాండోరాకు వచ్చిన జాక్ అనే మనిషి.. తర్వాత నావీల్లో ఒకడిగా మారిపోయి వారికి నాయకత్వం వహిస్తాడు. మనుషులపై పోరాటంలో నావీలను గెలిపిస్తాడు. ఇదీ స్థూలంగా 'అవతార్' కథ. 'అవతార్-2' విషయానికి వస్తే.. తమపై నావీల విజయంలో కీలక పాత్ర పోషించడమే కాక.. నావీల అమ్మాయినే పెళ్లాడి అక్కడే స్థిరపడ్డ జాక్ మీద పగబట్టిన మనుషులు.. జాక్‌తో పాటు అతడి కుటుంబాన్నీ అంతమొందించాలని ప్రయత్నిస్తే.. దాన్ని అతనెలా తిప్పికొట్టాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే నేపథ్యంలో సాగుతుందీ కథ.

దేశం.. ప్రాంతం.. భాష అనే తేడాలు లేకుండా 'అవతార్' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం.. జేమ్స్ కామెరూన్ తన ఊహాశక్తితో తీర్చిదిద్దిన 'పాండోరా' అనే అద్భుత ప్రపంచం. నిజంగా ఇలాంటి ప్రదేశం ఒకటుంటే ఎంత బాగుంటుందో అన్న ఆలోచన కలిగిస్తూ.. ఆ ప్రపంచంలో ప్రేక్షకులను విహరింపజేశాడు కామెరూన్. పెద్ద తెరలపై త్రీడీలో ఆ ప్రపంచాన్ని చూస్తున్నపుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ప్రేక్షకులకు అదొక సరికొత్త అనుభవం. హాలీవుడ్లో ఎన్నో విజువల్ వండర్స్ వచ్చాయి కానీ.. 'అవతార్' వాటన్నింటికీ చాలా భిన్నమైంది. 'అవతార్' అనే టైటిల్ దగ్గర్నుంచి.. మన పురాణ పురుషుల అవతారాలను తలపించేలా ఉన్న ప్రధాన పాత్రలు భారతీయ ప్రేక్షకులు మరింతగా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఐతే కేవలం కామెరూన్ 'అవతార్'లో కేవలం విజువల్ మాయాజాలంతో మాత్రమే మెప్పించలేదు. ఒక 'ఆత్మ' ఉన్న కథను నరేట్ చేశాడు. మనిషి ఆశకు హద్దు లేదని.. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ తనకే సొంతం కావాలని ఆశపడతాడని.. అలా అత్యాశకు పోతే.. ప్రకృతిని కబళించాలని చూస్తే వినాశనం తప్పదనే సందేశాన్ని ఈ పాండోరా ప్రపంచంతో ముడిపెట్టి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐతే 'అవతార్-2' విషయానికి వస్తే.. ఇందులోనూ కామెరూన్ మరోసారి తనకే సాధ్యమైన.. హద్దుల్లేని ఊహాశక్తితో విజువల్‌ మాయాజాలం చేశాడు. ఆయన విజువలైజేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎఫెక్ట్స్ కళ్లు చెదిరిపోయేలా చేస్తాయి.

కానీ 'అవతార్' చూసినపుడు కలిగిన ఆశ్చర్యం 'అవతార్-2' చూస్తుండగా కలగదు. ఎందుకంటే అప్పటికి తెరపై చూస్తున్న ప్రతి విషయం కొత్తగా.. వింతంగా అనిపించి.. వావ్ అనుకుంటూ చూశాం. ఇదివరకే పరిచయం అయిన ప్రపంచం ఈసారి మనకు కొత్తగా అనిపించదు. ఇక కథ పరంగానూ 'అవతార్'కు దీటుగా 'అవతార్-2' నిలబడలేకపోయింది. 'అవతార్'లో పాండోరాను కబళించడానికి మనుషులు చేసే ప్రయత్నం నేపథ్యంలో పెద్ద కాన్వాస్ లో నడుస్తుంది. కానీ 'అవతార్-2'లో హీరో కేవలం తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దీని పరిధి చిన్నదైపోయింది. విజువల్ గా అద్భుతంగా అనిపిస్తున్నప్పటికీ సర్ప్రైజింగ్ గా అనిపించకపోవడం.. కథలో ఆసక్తి తక్కువ కావడం.. మూడుంబావు గంటల సుదీర్ఘ నిడివి వల్ల 'అవతార్-2' మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. కానీ కామెరూన్ విజువల్ మాయాజాలం మనం పెట్టే ప్రతి రూపాయికి గిట్టుబాటు చేయిస్తుందనడంలో మాత్రం సందేహం లేదు.

'అవతార్' విషయంలో మన పురాణాల నుంచి స్ఫూర్తి పొందిన కామెరూన్.. 'అవతార్-2'లోనూ అలాంటి ప్రయత్నమే చేయడం విశేషం. రామాయణ.. మహాభారతాల్లోని అరణ్యవాసం స్ఫూర్తి ఈ కథలో కనిపిస్తుంది. పాండోరా గ్రహంలో ఉంటే తనను మనుషులు లక్ష్యంగా చేసుకోవడం వల్ల నావీలకు ఇబ్బందన్న ఉద్దేశంతో హీరో సముద్రాన్ని నమ్ముకుని బతికే మరో జాతి ఉన్న ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ తన కుటుంబంతో కలిసి గుట్టుగా జీవిస్తుంటాడు. 'అవతార్'కు పాండోరా నేపథ్యం అయితే.. ఈ కథకు సముద్రం కేంద్రంగా మారింది. సముద్ర గర్భంలో వింతలు విశేషాలు.. హీరో పిల్లల విన్యాసాల నేపథ్యంలో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలో విహరింపజేయడానికి కామెరూన్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో వచ్చే ప్రతి సన్నివేశం విజువల్ గా అద్భుతం అనే అనిపిస్తుంది. కానీ కథ పరంగా మాత్రం ఎక్కడా ఎగ్జైట్మెంట్ కనిపించదు. సన్నివేశాలు మరీ నెమ్మదిగా.. బోరింగ్ గా నడుస్తున్న భావన కలుగుతుంది.

కథాకథనాల్లో సర్ప్రైజ్ అంటూ ఏమీ కనిపించదు. విలన్ గ్యాంగ్ ఏదో ఒక రోజు హీరో గుట్టు కనిపెట్టడం.. ఆ తర్వాత అతను వారిపై పోరాడి గెలవడం.. ఈ లైన్ చాలా ముందుగానే అర్థమైపోతుంది. ఈ మలుపు కోసం ప్రేక్షకులు సుదీర్ఘ సమయం ఎదురు చూడాల్సి వస్తుంది. సన్నివేశాలను కామెరూన్ చాలా తాపీగా నరేట్ చేస్తూ వెళ్లాడు. సముద్ర అందాలు.. అందులో విన్యాసాలు ఒక దశ వరకు బాగానే అనిపించినా.. తర్వాత కొంచెం మొహం మొత్తడానికి కారణం రిపీటెడ్ సీన్లే. పతాక సన్నివేశాలు సైతం బాగా లెంగ్తీగా అనిపిస్తాయి. సముద్ర వింత జీవి హీరో కుటుంబాన్ని రక్షిస్తూ విలన్ల మీద విరుచుకుపడే సన్నివేశాలు.. యాక్షన్ ఘట్టాలు గూస్ బంప్స్ ఇచ్చినా.. క్లైమాక్స్ ఎంతకీ ముగియకుండా సాగుతూ....నే వెళ్తుంది. నిడివి కచ్చితంగా 'అవతార్-2'కు ఒక సమస్యే. అలా అని కామెరూన్ అండ్ టీం కష్టాన్ని తక్కువ చేయలేం. విజువల్ గా ఈ సినిమా కలిగించే అనుభూతికి ఇంకేదీ మ్యాచ్ చేయలేదు. 'అవతార్-2' కచ్చితంగా పైసా వసూల్ సినిమానే. కానీ 'అవతార్' చూశాక కథ పరంగా.. విజువల్ గా ఇంకా ఏదో ఉండాలని ఆశిస్తే నిరాశ తప్పదు. తెలుగు వెర్షన్ కు అవసరాల శ్రీనివాస్ అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణ. ఇది 'మన సినిమా' అనిపించేలా మన భాషలోని చమత్కారాన్ని అవసరాల జోడించిన తీరును కొనియాడాల్సిందే. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. తెలుగు వెర్షన్ అంటే తక్కువగా చూడకుండా నిరభ్యంతరంగా మన భాషలో ఈ సినిమా చూడొచ్చు. క్వాలిటీ స్క్రీన్లో త్రీడీలో 'అవతార్-2' చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. కాకపోతే 'అవతార్-2'ను పూర్తి చేయడానికి కొంచెం ఓపిక మాత్రం కావాలి.

చివరగా: అవతార్-2.. మాయాజాలమే కానీ!

రేటింగ్-2.75/5