Begin typing your search above and press return to search.

అవెంజర్స్ రచ్చ మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   3 May 2018 8:15 AM GMT
అవెంజర్స్ రచ్చ మామూలుగా లేదుగా
X
అసలు ఒక్క సూపర్ హీరో తెర మీద కనిపిస్తేనే కిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది అందరు కలిసి ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించడమే కాదు ఏకంగా యుద్ధాలు చేసుకుంటూ ఉంటే చూసేందుకు రెండు కళ్ళు సరిపోతాయా. ఇప్పుడు అవెంజర్స్ విషయంలో అదే జరుగుతోంది. భారతీయ బాషలతో పాటు ఇంగ్లీష్ లో త్రీ డి వెర్షన్ లో విడుదలైన ఈ హాలీవుడ్ విజువల్ వండర్ కు మనవాళ్ళు బ్రహ్మరధం పడుతున్నారు. దానికి నిదర్శనమే కలెక్షన్లు. ఇప్పటి దాకా ఒక్క ఇండియాలోనే 135 కోట్ల దాకా కలెక్ట్ చేసిన అవెంజర్స్ ఇంకా బలంగానే ఉంది. చాలా చోట్ల ప్రాంతీయ సినిమాలను దెబ్బ తీసి మరీ తన జోరును కొనసాగించడం విశేషం. విడుదలైన మొదటి రోజు నుంచి ఐదో రోజు దాకా ఒక్క రూపాయి తగ్గకుండా సరాసరి 5 రోజులు 20 కోట్లు చొప్పున లాగేసిన అవెంజర్స్ మరో రెండు వారాల దాకా స్ట్రాంగ్ గా ఉండొచ్చు అనేది ట్రేడ్ రిపోర్ట్.

స్పైడర్ మ్యాన్-హల్క్-ఐరన్ మ్యాన్-డెడ్ పూల్-యాంట్ మ్యాన్-తోర్-బ్లాక్ ప్యాంతర్ ఇలా అందరు కలిసి తానోస్ అనే లోక వినాశాకుడి అంతం చూసేందుకు ఒకటి కావడం ఆ యుద్ధంలో తానోస్ దే పై చేయి అయితే వాళ్ళందరూ ఏం చేసారు అనే దాని మీద కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో మతులు పోయే విజువల్స్ తో తీర్చిదిద్దిన విధానానికి మనవాళ్ళు టికెట్ కౌంటర్ల దగ్గర క్యు కడుతున్నారు. కొన్ని చోట్ల మల్టీ ప్లెక్స్ లలో భరత్ అనే నేను-రంగస్థలం వసూళ్ళ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించే స్థాయిలో అవెంజర్స్ రచ్చ సాగిందంటే చిన్న విషయం కాదు. ఇక్కడే కాదు మార్వేల్ సంస్థ నిర్మించిన ఈ మూవీకి అన్ని చోట్ల ఇదే రెస్పాన్స్ ఉంది. కథ ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఇదేమి హాలీవుడ్ లోనే ఇప్పటిదాకా రాని గొప్ప చిత్రమేమి కాదు. కాని ఇలా సూపర్ హీరోస్ అందరిని కాంబోగా చూపించడంలోనే ఇది సగం విజయం సాధించింది. దానికి తోడు ఈ సారి ఎమోషన్ ని కామెడీ ని కూడా కథలో భాగం చేయటంతో ప్రేక్షకులు ఇంకాస్త కొత్తగా ఫీల్ అవుతున్నారు. డబుల్ సెంచరీ కష్టమే కాని నూట యాభై మాత్రం గ్యారెంటీ అనిపిస్తోంది అవెంజర్స్ జోరు చూస్తుంటే.