Begin typing your search above and press return to search.

అవతార్‌ ను కొట్టేందుకు అవెంజర్స్‌ మాస్టర్‌ ప్లాన్‌

By:  Tupaki Desk   |   20 Jun 2019 6:48 AM GMT
అవతార్‌ ను కొట్టేందుకు అవెంజర్స్‌ మాస్టర్‌ ప్లాన్‌
X
హాలీవుడ్‌ సెన్షేషన్‌ మూవీ 'అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌' చిత్రం రెండు నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విడుదలకు ముందే సినిమా సృష్టించిన ప్రకంపనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున అడ్వాన్స్‌ బుకింగ్‌ జరిగాయి. హాల్‌ మూవీస్‌ ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న మూడు బిలియన్‌ డాలర్ల మార్క్‌ను ఈ చిత్రం చేరుకుంటుందని విడుదలైన తర్వాత అందరు అనుకున్నారు. అయితే మూడు నాలుగు వారాల తర్వాత కాస్త కలెక్షన్స్‌ మందగించాయి.

టైటానిక్‌ చిత్రం కలెక్షన్స్‌ ను క్రాస్‌ చేసిన తర్వాత ఎండ్‌ గేమ్‌ కలెక్షన్స్‌ తగ్గాయి. అవతార్‌ అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా 2.787 బిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయడం జరిగింది. మొదట్లో అవతార్‌ రికార్డును బద్దలు కొట్టడం కష్టమేమీ కాదని భావించారు. కాని రోజులు గడిచే కొద్ది కలెక్షన్స్‌ తగ్గడంతో అవెంజర్స్‌ కొద్ది దూరంలో అవతార్‌ రికార్డుకు నిలిచి పోయే పరిస్థితి ఏర్పడింది. అవతార్‌ రికార్డును బద్దలు కొట్టాలంటే అవెంజర్స్‌ కు అటు ఇటుగా 40 మిలియన్‌ డాలర్లు అవసరం.

సినిమా ఫుల్‌ రన్‌ పూర్తి అయిన కారణంగా ఇంకా అంత భారీ మొత్తం రాబట్టడం కష్టం అని నిర్మాతలు కూడా నిర్ధారణకు వచ్చారు. కాని అవతార్‌ రికార్డును బ్రేక్‌ చేయాలని మాత్రం బలంగా అవెంజర్స్‌ నిర్మాణ సంస్థ అయిన మార్వెల్‌ సంస్థ కోరుకుంటుంది. అందుకే అవెంజర్స్‌ ను రీ రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. దాదాపుగా 30 నిమిషాల కొత్త ఫుటేజ్‌ తో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్‌ చేయాలని తద్వారా సినిమాకు మినిమంగా 50 మిలియన్‌ డాలర్ల వసూళ్లు నమోదు అవుతాయని ఆశిస్తున్నారు. అదే జరిగితే అవతార్‌ రికార్డు బ్రేక్‌ అవుతుందని మార్వెల్‌ సంస్థ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ కొత్త ఫుటేజ్‌ తో రీ రిలీజ్‌ కాబోతుంది.