Begin typing your search above and press return to search.

ఆ మల్టీస్టారర్‌ రీమేక్‌ అంత సులభం ఏమీ కాదు

By:  Tupaki Desk   |   13 April 2020 6:45 AM GMT
ఆ మల్టీస్టారర్‌ రీమేక్‌ అంత సులభం ఏమీ కాదు
X
గత కొన్ని రోజులుగా మలయాళి హిట్‌మూవీ అయ్యప్పన్‌ కోషియమ్‌ ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ను తీసుకుందని పలువురు స్టార్‌ హీరోలతో ఈ సినిమా విషయమై చర్చలు జరుపుతుంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా సితార వారు ఈ విషయమై స్పందిస్తూ రీమేక్‌ రైట్స్‌ ను 3 కోట్లకు కొనుగోలు చేసిన విషయం వాస్తవమే అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారట. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడం అంత సులభం కాదంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కథ దృష్ట్యా స్టార్‌ హీరోలు ఈ సినిమాలో ఉంటేనే కథకు న్యాయం జరుగుతుంది. ఇద్దరు స్టార్‌ హీరోలను ఈ సినిమాలో నటింపజేసి ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ను సంతృప్తి పర్చడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదు. తెలుగులో హీరోల ఫ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ హీరోను ఏమాత్రం తక్కువ చేసి చూపించినా.. మరో హీరో కంటే తక్కువగా చూపించినా ఊరుకోరు. అయితే అయ్యప్పన్‌ కోషియమ్‌ కథ చూసినట్లయితే ఒక హీరోకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఒక హీరోకు తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.

ఇక క్లైమాక్స్‌ ను ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో తీస్తే ఖచ్చితంగా టాలీవుడ్‌ ప్రేక్షకులు సినిమాను తిరష్కరించే అవకాశం ఉంది. అలా అని క్లైమాక్స్‌ ను మార్చితే సినిమా జీవం పోయినట్లవుతుంది. రీమేక్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించినా కూడా ఏదో ఒక చోట లోటు జరగడం ఖాయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతటి కఠిన పరిస్థితుల్లో ఆ సినిమాను రీమేక్‌ చేయడం అంటే చాలా పెద్ద సాహసంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సాహసంను ఛాలెంజ్‌ గా తీసుకుని సితార వారు సినిమాను తెరకెక్కిసారా.. ఈ సినిమాను డైరెక్ట్‌ చేసేందుకు ఏ దర్శకుడు ముందుకు వస్తాడు అనేది చూడాలి.

మొన్నటి వరకు ఈ సినిమాలో బాలకృష్ణ.. రానాలు నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై సితార వారు క్లారిటీ ఇవ్వలేదు. అలాగే రానా కూడా ప్రస్తుతానికి తన చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్‌ లను పూర్తి చేసిన తర్వాతే తదుపరి చిత్రాలకు కమిట్‌ అవ్వాలనేది తన ఆలోచనగా ఆయన సన్నిహితుల వద్ద అన్నాడట. మరి ఈమల్టీస్టారర్‌ కు ఓకే చెప్పబోతున్న ఆ హీరోలు ఎవరు.. అసలు ఎవరైనా ముందుకు వస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.