Begin typing your search above and press return to search.

రాఘవేంద్రరావుగారు ఆ మాట చెప్పగానే షాక్ అయ్యాను: బి.గోపాల్

By:  Tupaki Desk   |   16 Oct 2021 11:10 AM GMT
రాఘవేంద్రరావుగారు ఆ మాట చెప్పగానే షాక్ అయ్యాను: బి.గోపాల్
X
టాలీవుడ్ తెరకి భారీ యాక్షన్ సినిమాలను పరిచయం చేసిన సీనియర్ స్టార్ డైరెక్టర్లలలో బి.గోపాల్ ఒకరుగా కనిపిస్తారు. దర్శకుడిగా తన సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. ''బొబ్బిలి రాజా' .. 'అసెంబ్లీ రౌడీ' .. 'సమరసింహా రెడ్డి' .. 'నరసింహా నాయుడు' వంటి బ్లాక్ బస్టర్లు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. ఈ సినిమాలన్నీ కూడా అప్పట్లోనే వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించాయి. అలాంటి బి. గోపాల్ తాజా ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

"మాది ఒంగోలు దగ్గర 'ఎం.నిడమానూరు' అనే గ్రామం. మా ఊరు .. మా స్కూలు చాలా అందంగా ఉంటాయి. ఒంగోలు శర్మ కాలేజీలో నేను చదువుతున్న రోజుల్లో నాటకాలు వేసేవాడిని. మా ఊళ్లోని వాళ్లంతా కూడా మెచ్చుకునేవారు. కాలేజ్ లో చేరిన తరువాత కొన్ని రోజులు బాగానే చదువుకున్నాను. ఆ తరువాత నాటకాల పిచ్చిలో పడి చదువును పక్కన పెట్టేశాను. ఆ సమయంలోనే సినిమాలు బాగా చూసేవాడిని. దాంతో నా బుక్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా పట్టించుకోని స్థాయికి వెళ్లిపోయాను. ఇక నాకు చదువు వంటబట్టదు అనే విషయం అర్థమైపోయింది.

ఒకసారి ఫ్రెండ్ రూములో ఒంటరిగా ఉన్నప్పుడు, మన లైఫ్ ఏంటి? మనం ఎటు వెళుతున్నాం? అనే ఒక ఆలోచన వచ్చింది. సినిమాలు అంటే ఇష్టం ఉండటం వలన, మద్రాస్ వెళితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజున .. ఆ సమయంలో వచ్చిన ఒక చిన్న ఆలోచన నా జీవితాన్ని మార్చేసింది. నేను సినిమాల్లోకి వెళ్లాలనేకుంటున్నాననే విషయాన్ని మా నాన్నతో చెప్పాను. మద్రాసులో నాన్నకి తెలిసిన ఒకాయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మా నాన్న నన్ను తీసుకుని ఆయన దగ్గరికి వెళ్లారు. నా గురించి ఆయనకి చెప్పారు.

ఆయన నన్ను తీసుకుని దర్శకుడు పీసీ రెడ్డిగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఇంటి దగ్గర నుంచి నెలకి 250 రూపాయలు పంపించేవారు. పీసీరెడ్డి గారి దగ్గర రెండు సినిమాలకి పని చేసిన తరువాత, నేను రాఘవేంద్రరావుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. ఆయన దగ్గర నా మొదటి సినిమా 'అడవి రాముడు'. ముదుమలై ఫారెస్టులో 50 రోజుల పాటు షూటింగు జరిగింది. తెరపై నేల టిక్కెట్ లో కూర్చుని ఎన్టీఆర్ సినిమాలు చూసిన నేను, 'అడవిరాముడు' సినిమా షూటింగులో ఆయనను చాలా దగ్గరగా చూశాను. ఆయనను అలా చూడాలనిపిస్తూనే ఉండేది.

ఆ తరువాత 'దేవత' సినిమాకి నేను కో - డైరెక్టర్ గా చేస్తున్నాను. ఆ సినిమా సగం వరకూ పూర్తయింది. ఒక రోజున నేను రాఘవేంద్రరావుగారి ఇంటికి వెళ్లగానే ఆయన కంగ్రాట్స్ చెప్పారు. 'ఎందుకండీ అంటే' .. "రామానాయుడుగారికి నీ వర్కింగ్ స్టైల్ నచ్చింది .. నీకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తానని అన్నారు .. కథ చూసుకోమన్నారు" అని చెప్పారు. ఆ మాటలు నమ్మలేక షాక్ అయ్యాను. వెంటనే రామానాయుడిగారిని కలిశాను. ఆయన అవే మాటలు నాకు చెప్పారు. ముందుగా సుమన్ గారితో .. ఆ తరువాత కృష్ణగారితో సినిమా చేయాలనుకున్నాము .. కానీ కుదరలేదు. ఆ తరువాత పరుచూరి బ్రదర్స్ దగ్గరున్న కథతో దర్శకుడిగా మొదటి సినిమా చేసే ఛాన్స్ వచ్చింది .. అదే 'ప్రతిధ్వని' అంటూ చెప్పుకొచ్చారు.