Begin typing your search above and press return to search.

బాహుబలి-2 ఆడియో.. అద్భుతహ!

By:  Tupaki Desk   |   27 March 2017 4:44 AM GMT
బాహుబలి-2 ఆడియో.. అద్భుతహ!
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ.. తాను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లోకెల్లా ఈ ఆడియోనే ది బెస్ట్ అని తేల్చి చెప్పాడు. ప్రభాస్ కొన్ని రోజుల కిందట రాజీవ్ మసంద్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ‘బాహుబలి: ది బిగినింగ్’తో పోలిస్తే ‘ది కంక్లూజన్’ పాటలు ఇంకా బాగుంటాయని.. ఒక్కసారి వినగానే ఈ పాటలు వావ్ అనిపించాయని అన్నాడు. ఐతే నటీనటులైనా.. టెక్నీషియన్లయినా అప్పటికి తాము చేస్తున్న సినిమానే గొప్ప అన్నట్లు మాట్లాడటం సహజం. రాజమౌళి.. ప్రభాస్ మాటలు కూడా అలాంటివే అనిపించొచ్చు. కానీ ‘ది కంక్లూజన్’ పాటలు వింటే మాత్రం రాజమౌళి.. ప్రభాస్ అతిశయోక్తులేమీ చెప్పలేదని.. ఆడియో గురించి వాళ్లు సరిగ్గానే చెప్పారని అర్థమవుతుంది. అవును.. ‘బాహుబలి-2’ ఆడియో వింటే కచ్చితంగా ‘వావ్’ అనాల్సిందే.

సంగీత దర్శకుడు.. గేయ రచయితలు.. గాయనీగాయకులు ఎంతో మనసుపెట్టి ఒక తపనతో.. ఒక భావోద్వేగంతో పని చేస్తే.. ఎలా ఉంటుందో చెప్పడానికి ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో ఒక రుజువు. ఆడియోలో కీరవాణి తండ్రి శివశక్తి దత్తా.. డాక్టర్ రామరాజు కలిసి రచించగా.. దలేర్ మెహంది.. కీరవాణి.. మౌనిక కలిసి పాడిన ‘సాహోరే బాహుబలి’ పాట వినగానే ఒక రకమైన ఉద్రేకం కలగడం ఖాయం. ఇందులోని లిరిక్స్.. ట్యూన్.. గానం.. దేనికవే అద్భుతం. హేస్సా.. రుద్రస్సా.. హేసరభద్రసముద్రస్సా.. సాగే హమ్మింగ్ అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. అలాగే ‘‘భళి భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి.. భువనాలన్నీ జై కొట్టాలి.. గగనాలే ఛత్రం పట్టాలి’’ అంటూ పాట ఆరంభంలో.. చివర్లో దలేర్ మెహంది వాయిస్ తో వచ్చే గానం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తుంది.

ఇక ఆడియోలో నెక్స్ట్ బెస్ట్ సాంగ్ అంటే ‘దండాలయ్యా దండాలయ్యా మాతోనే ఉండాలయ్యా’ అంటూ సాగే మరో పాట ఇంకో అద్భుతం. ఈ పాటను కీరవాణి రచిస్తే.. ఆయన తనయుడు కాలభైరవ పాడటం విశేషం. ఈ పాటలోనూ లిరిక్స్.. గానం ఎమోషనల్ గా కదిలిస్తాయి. ఈ రెండు పాటలు సినిమాలో ఎలా ఉంటాయో ఊహించుకుంటే ఒక రకమైన పులకింత.. ఎమోషనల్ కలగడం ఖాయం. కీరవాణే రాసిన ‘ఒక ప్రాణం ఒక త్యాగం’ పాటలోనూ సాహిత్యం అద్భుతంగా కుదిరింది. కీరవాణిలో ఎంత గొప్ప లిరిసిస్ట్ ఉన్నాడో ఈ పాట వింటే తెలుస్తుంది. ఈ పాటనూ కాలభైరవనే పాడాడు. తండ్రి సంగీతానికి.. సాహిత్యానికి న్యాయం చేస్తూ ఈ పాటను కూడా అతను చాలా బాగా పాడాడు. ఇక చైతన్య కృష్ణ రాసిన రొమాంటిక్ సాంగ ‘హంసనావ’ పాట కూడా బావుంది. ‘ది బిగినింగ్’లోని పచ్చబొట్టేసినా స్థాయిలో లేదు కానీ.. ఇది కూడా ప్రత్యేకంగా అనిపించే పాటే. ఇక ఆడియోలో మిగతా పాటల కంటే కొంచెం తక్కువ అనిపించేది ‘కన్నా నిదురించరా’ అంటూ సాగే పాటే. ఈ పాటను కూడా కీరవాణే రాయడం విశేషం. శ్రీనిధి.. శ్రీ శౌర్య ఈ పాటను ఆలపించారు. ఓవరాల్ గా చూస్తే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆల్బమ్ కచ్చితంగా చాలా ప్రత్యేకంగా అనిపించే ఆల్బమే. గత కొన్నేళ్లలో ఇంత ఎమోషన్ కలిగించిన ఆల్బం ఇంకేదీ రాదంటే అతిశయోక్తి లేదు. ‘ది బిగినింగ్’కు వచ్చిన రెస్పాన్స్ చూసి బాహుబలి టీం రెండో భాగం విషయంలో మరింత ఉత్సాహంతో.. తపనతో.. కసితో.. బాధ్యతతో పని చేసిందనడానికి ‘ది కంక్లూజన్’ ఆడియో ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని ఆశిద్దాం.











Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/