Begin typing your search above and press return to search.

ఇక అక్కడ కూడా నాన్-బాహుబలి కేటగిరీ

By:  Tupaki Desk   |   6 May 2017 11:08 AM GMT
ఇక అక్కడ కూడా నాన్-బాహుబలి కేటగిరీ
X
‘బాహుబలి: ది బిగినింగ్’ వచ్చాక తెలుగు సినిమాల బిజినెస్.. వసూళ్ల లెక్కలే మారిపోయాయి. మిగతా సినిమాల్ని బాహుబలితో కలిపి మాట్లాడటం కష్టం కాబట్టి.. కొత్తగా ‘నాన్-బాహుబలి’ అనే ఒక కొత్త కేటగిరీని తీసుకొచ్చాయి ట్రేడ్ వర్గాలు. సామాన్య జనాలకు కూడా ఈ మాట బాగా అలవాటైపోయింది. వేరే ఏ సినిమాకు సంబంధించి అయినా.. బిజినెస్.. వసూళ్ల లెక్కలు మాట్లాడాలంటే ‘నాన్-బాహుబలి’ అనే పదం ఉపయోగించడం తప్పనిసరి అయింది. ఐతే అక్కడక్కడా కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ వచ్చిన కొన్నాళ్లకు ఆ సినిమా రికార్డులు కూడా ఒక్కొక్కటి బద్దలవడం మొదలైంది. దీంతో కాల క్రమంలో ‘నాన్-బాహుబలి’ అనే మాట ఉండదేమో అనుకున్నారు. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ అలాంటి అవకాశం లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూస్తుంటే కనీసం పదేళ్ల పాటు ఈ మాటను ఉపయోగించక తప్పదేమో అనిపిస్తోంది.

విశేషం ఏంటంటే.. ‘బాహుబలి: ది బిగినింగ్’ వచ్చినపుడు కేవలం తెలుగు సినిమా వరకే ‘నాన్-బాహుబలి’ అనే మాట వినిపించేది. కానీ ఇకపై వేరే ఇండస్ట్రీల వాళ్లు సైతం ఈ మాటను వాడక తప్పేలా లేదు. మొత్తం ఇండియా అంతటా కనీ వినీ ఎరుగని స్థాయిలో వసూళ్లు రాబడుతోందీ సినిమా. ఇప్పుడిప్పుడే ‘బాహుబలి: ది కంక్లూజన్’ నెలకొల్పిన రికార్డులు బద్దలయ్యేలా లేవు. ‘పీకే’ లాంటి సినిమా నెలకొల్పిన రికార్డులే మూడేళ్ల పాటు నిలిచి ఉన్నాయి. ‘బాహుబలి-2’ ఊపు చూస్తుంటే ఆ సినిమా కంటే కనీసం 60 శాతం అధికంగా వసూళ్లు సాధించేలా ఉంది. మరి ఈ రికార్డును బద్దలు కొట్టడమంటే మాటలా? శంకర్ తీస్తున్న ‘2.0’కు కూడా అది సాధ్యం కాకపోవచ్చేమో. కాబట్టి చాలా ఏళ్ల పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం రికార్డుల విషయానికి వస్తే ‘నాన్-బాహుబలి’ అనే మాటను వాడక తప్పదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/