Begin typing your search above and press return to search.

బాహుబలి-2కి థియేటర్లివ్వలేదా?

By:  Tupaki Desk   |   17 Jun 2017 9:21 AM GMT
బాహుబలి-2కి థియేటర్లివ్వలేదా?
X
బాహుబలి: ది బిగినింగ్’ ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ చాలా చోట్ల సత్తా చాటింది. అమెరికా.. ఐరోపా దేశాల్లోనూ కళ్లు చెదిరే వసూల్లు సాధించింది.ఐతే ఒక్క చైనాలో మాత్రం ఆ సినిమాకు గర్వ భంగమైంది. అక్కడ వంద కోట్లు టార్గెట్ పెట్టుకుని భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తే.. నామమాత్రంగా కేవలం రూ.7 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అవి రిలీజ్ ఖర్చులకే సరిపోవడంతో నిర్మాతకు తిరిగొచ్చిందేమీ లేదు. ఐతే అప్పుడు విడుదల చాలా ఆలస్యమైందని.. సరైన స్క్రీన్లు ఇవ్వలేదని.. ఇలా ‘బాహుబలి: ది బిగినింగ్’ ఫెయిల్యూర్ కు నిర్మాతలు రకరకాల కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ప్రతికూలతేమీ లేకుండా ఈసారి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

‘బాహుబలి: ది బిగినింగ్’ ఇండియాలో విడుదలైన దాదాపు ఏడాదికి చైనాలో రిలీజవ్వగా.. ‘ది కంక్లూజన్’ను మాత్రం ఇక్కడ రిలీజైన ఐదు నెలలకే.. అంటే సెప్టెంబరులోనే అక్కడా విడుదల చేస్తున్నారు. దీనికి తోడు ‘దంగల్’ను రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటరే ‘బాహుబలి-2’ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఈసారి మంచి స్క్రీన్లే దక్కుతాయని ఆశిస్తున్నారు. అంతా బాగుంది కానీ.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ అనుభవంతో బాహుబలి-2కు ఆశించిన స్థాయిలో థియేటర్లయితే ఇవ్వట్లేదన్నది సమాచారం. తొలి భాగం 7-8 వేల మధ్య థియేటర్లలో రిలీజైనట్లు వార్తలొచ్చాయి. ఐతే ‘ది కంక్లూజన్’ మాత్రం 4 వేల థియేటర్లలోనే రిలీజవుతుందట. ‘దంగల్’ అక్కడ 9 వేల థియేటర్లలో రిలీజై ప్రభంజనం సృష్టించడం విశేషం. ఎంత మంచి టైమింగ్ చూసి.. ఎంత మంచి స్క్రీన్లలో రిలీజ్ చేసినప్పటికీ ‘బాహుబలి-2’ చైనాలో మిరాకిల్స్ అయితే చేస్తుందన్న అంచనాల్లేవు. ‘ది బిగినింగ్’ను పట్టించుకోని వాళ్లు ‘ది కంక్లూజన్’ కోసం మాత్రం ఏం ఎగబడిపోతారన్నది డౌటు. ‘దంగల్’ లాంటి సినిమాలు వారికి కొత్త కానీ.. ‘బాహుబలి’ తరహా రాజులు-రాజ్యాలు-యుద్ధాల నేపథ్యంలో చైనీస్ సినిమాలు చాలానే వచ్చాయి. హాలీవుడ్ సినిమాలూ చాలానే చూశారు. అందుకే బాహుబలి-2 కూడా అక్కడ అంచనాలు తక్కువే ఉండటంతో థియేటర్లు కూడా తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/