Begin typing your search above and press return to search.

బాహుబలి పరువు నిలుస్తుందా?

By:  Tupaki Desk   |   28 April 2018 1:55 PM GMT
బాహుబలి పరువు నిలుస్తుందా?
X
సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు విడుదలై ప్రభంజనం సృష్టించింది ‘బాహుబలి: ది కంక్లూజన్’. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్ల దాకా వసూళ్లు సాధించిందా చిత్రం. విడుదలైన ఈ ఏడాది తర్వాత కూడా ఇంకా ఆ చిత్రం ప్రపంచ దేశాల్లో అక్కడక్కడా ఆడుతూనే ఉంది. ప్రస్తుతం జపాన్‌ లో ఆ చిత్రం వంద రోజుల ప్రదర్శన కూడా పూర్త చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మే 4న అక్కడ ‘బాహుబలి’ రిలీజవుతోంది. మరి అక్కడ ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మిగతా దేశాల్లో విడుదలవుతున్నపుడు లేని ఉత్కంఠ చైనాలో విడుదలవుతుంటే బాహుబలి నిర్మాతల్లో కనిపిస్తోంది. ఇందుకు కారణాలు లేకపొలేదు. ‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హవా సాగించింది. భారీ వసూళ్లు రాబట్దింది. కొన్ని అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైన ప్రశంసలు అందుకుంది. కానీ చైనీయులు మాత్రం దీన్ని పట్టించుకోలేదు. ఎంతో హడావుడి రిలీజ్ చేస్తే.. విడుదల ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. ఇది ‘బాహుబలి’ టీంకు ఒక అవమానం లాగా మిగిలిపోయింది.

చైనాలో ‘బాహుబలి’ తరహా సినిమాలు కొత్త కాదు. పైగా ‘బాహుబలి-1’ విడుదలైన తర్వాత చాలా లేటుగా.. సరైన ప్రమోషన్ లేకుండా చైనాలో రిలీజ్ చేయడం ప్రతికూలమైనట్లుగా చిత్రి నిర్మాతలు పేర్కొన్నారు. మరి ‘బాహుబలి-2’ విషయంలో ప్రమోషన్ కొంచెం గట్టిగానే చేసినట్లున్నారు. స్క్రీన్లు కూడా ఎక్కువగానే.. మంచివే ఇచ్చారట. మరి ఇప్పుడు ‘బాహుబలి-2’ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ‘బాహుబలి-1’ నచ్చితేనే కదా రెండో భాగం చూస్తారు... దాన్ని పట్టించుకోని వాళ్లు దీన్ని మాత్రం ఎలా ఆదరిస్తారనే బేసిక్ క్వశ్చన్ తలెత్తుతోంది. ఇదే ‘బాహుబలి’ నిర్మాతల్లోనూ గుబులు రేపుతోంది. మరి ఈ చిత్రానికి అక్కడ ఎలాంటి పలితం దక్కుతుందో చూడాలి.