Begin typing your search above and press return to search.

బాహుబలి 2.. 15 మిలియన్ డాలర్లు గ్యారెంటీ

By:  Tupaki Desk   |   3 May 2017 10:17 AM GMT
బాహుబలి 2.. 15 మిలియన్ డాలర్లు గ్యారెంటీ
X
తుఫాను వచ్చినప్పడు ఎంత పెద్ద చెట్టయినా తలవంచాల్సిందే. బాహుబలి- ది కంక్లూజన్ రిలీజయినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎప్పటి నుంచో ఉన్న పాత రికార్డులన్నీ బాహుబలి కలెక్షన్ల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఇందులో టాలీవుడ్ - బాలీవుడ్ - ఓవర్సీస్ అన్న తేడాయేం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పాత రికార్డులు అన్నీ మాయమై కొత్త రికార్డులు క్రియేటవుతున్నాయి.

అమెరికా బాక్సాఫీస్ లో మంగళవారం నాడు బాహుబలి 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రిలీజయినప్పటి నుంచి ఇప్పటిదాకా బాహబలి-2 అమెరికాలో మొత్తం 12 మిలియన్ డాలర్ల కలెక్షన్లు దక్కించుకుంది. యూఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రం బాహుబలి-2 కావడం విశేషం. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథతో అమీర్ ఖాన్ నటించిన దంగల్ పేరిట రికార్డు నమోదై ఉంది. బుధవారం కలెక్షన్ల లెక్క తేలాక ఈ రికార్డు సైతం బాహుబలి సొంతమైపోతుందని అంచనా. శనివారం సాయంత్రానికి 15 మిలియన్ డాలర్ల కలెక్షన్ వస్తుందని లెక్కలు వేస్తున్నారు.

ఓవర్సీస్ లో బాహుబలి-2 చిత్ర ప్రదర్శన హక్కులు రికార్డుస్థాయి ధరలకు విక్రయించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని ట్రేడ్ పండితులు ఊహించినా వారం రోజుల వ్యవధిలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధిస్తుందని ఊహించలేకపోయారు. మొత్తానికి బాహుబలి-2 రికార్డుల్లో కొత్త మైలురాయి సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 700 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూలు చేసింది. ఇంతవరకు ఎవరికీ సాధ్యంకాని 1000 కోట్ల రూపాయల కలెక్షన్ కూడా అతి త్వరలోనే బాహుబలి ఖాతాలో జమకానుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజంగా చరిత్రాత్మకమే కదా!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/