Begin typing your search above and press return to search.

కాస్తయినా కనికరం చూపని బాహుబలి

By:  Tupaki Desk   |   25 July 2015 8:56 AM GMT
కాస్తయినా కనికరం చూపని బాహుబలి
X
బాహుబలి కోసమని 'శ్రీమంతుడు' 20 రోజులు వెనక్కి వెళ్లిపోయింది. అల్లరి నరేష్ కూడా తన సినిమా ఇంకో వారం వాయిదా వేసుకున్నాడు. అయినా ఈ 'బాహుబలి' కొంచెమైనా పెద్ద మనసు లేకపోయింది. రెండు వారాలు ఖాళీ ఇచ్చినా ఆకలి తీరట్లేదు. ఇప్పటికే నాలుగొందల కోట్లు మింగినా ఆకలి ఆకలి అని అరుస్తూనే ఉన్నాడు. రెండు వారాలు బాక్సాఫీస్ ని దున్నుకున్నాడు కదా.. మూడో వారానికైనా తగ్గుతాడనుకుంటే అదేమీ జరగలేదు. సెకండ్ వీకెండ్ తర్వాత సోమవారం నుంచి జోరు తగ్గిందిలే అనుకుంటే మళ్లీ వీకెండ్ వచ్చేసరికి బాహుబలి కథ మళ్లీ మొదటికొచ్చింది. 'బుక్ మై షో' ఓపెన్ చేస్తే.. ఉదయం షోలకు ఖాళీలున్నాయి కానీ.. మధ్యాహ్నం నుంచి అన్ని షోలూ దాదాపుగా ఫుల్ గా కనిపిస్తున్న పరిస్థితి.

శని ఆదివారాల్లో మల్టీప్లెక్సుల్లో చాలా షోలు 'సోల్డ్ ఔట్' అని చూపిస్తున్నాయి. ఈ వారం తెలుగు లో ఒకటికి మూడు కొత్త సినిమాలు వచ్చినా బాహుబలి జోరు తగ్గలేదు. అల్లరి నరేష్ జేమ్స్ బాండ్.. 'బాహుబలి' జోరుకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. తమిళ డబ్బింగ్ సినిమాలు జిల్లా, డిమాంటి కాలనీ పరిస్థితి కూడా అంతే. బాహుబలి టికెట్లు దొరక్కుంటే ఈ సినిమాలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ షోలకైతే ఇప్పటికీ రికమండేషన్ ద్వారా టికెట్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మూడో వారానికి కూడా ఈ స్థాయిలో టికెట్లకు డిమాండ్ ఉండడం గత కొన్నేళ్లలో ఏ తెలుగు సినిమాకు కూడా లేదనే చెప్పాలి. పోకిరి, మగధీర లాంటి సినిమాలకు డిమాండ్ ఉంది కానీ.. మరీ ఈ స్థాయిలో కాదు. శ్రీమంతుడు వచ్చే వరకు 'బాహుబలి' హవా ఇలాగే ఉంటుందేమో.