Begin typing your search above and press return to search.

శంకర్ మీద జక్కన్న ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   22 Nov 2016 5:30 PM GMT
శంకర్ మీద జక్కన్న ఎఫెక్ట్
X
ఇండియాలో శంకర్ లాగా సినిమాలు తీయగలిగేవాళ్లు ఇంకెవరూ ఉండరనే అనుకున్నారు కొన్నేళ్ల ముందు వరకు. మొదట్నుంచి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో సినిమాలు తీయడం అలవాటైన శంకర్.. ‘రోబో’తో ఇండియన్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాడు. ఆ సినిమా చూశాక ఇంకెవరూ శంకర్ ను ఇంకెవరూ అందుకోలేరనే అనుకున్నారంతా. తనకు తాను అత్యున్నత ప్రమాణాల్ని నిర్దేశించుకుని.. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ‘రోబో’ను తీర్చిదిద్ది తనకు తానే సాటి అనిపించుకున్నాడు శంకర్.

ఐతే ఇప్పుడు ప్రమాణాల పరంగా ఇప్పుడు మరో దర్శకుడు విసిరిన సవాల్ ను స్వీకరించి అందుకనుగుణంగా రోబో సీక్వెల్ ‘2.0’ను మరింత ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాల్సి వస్తోంది. ఆ దర్శకుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘రోబో’తో శంకర్ ఎలాగైతే ఇండియన్ సినిమా స్థాయిని పెంచాడో.. రాజమౌళి అంత కంటే మిన్నగా ‘బాహుబలి’ సినిమాతో మన సినిమా ప్రమాణాల్ని పెంచాడు. మామూలుగా శంకర్ తనకు తాను ఉన్నత ప్రమాణాలు నిర్దేశించుకుంటాడు కానీ.. ఈసారి మాత్రం రాజమౌళి అతడికి లక్ష్యాన్ని నిర్దేశించాడు.

అందుకే ‘రోబో’ తీయడం అంటే ఎవరెస్టు ఎక్కడం లాంటిదని.. ‘2.0’ ఎవరెస్టునే మోయడం అని అన్నాడు శంకర్. తన ‘2.0’తో పాటు ‘బాహుబలి’ని కూడా జోడించి.. ఇలాంటి సినిమాలు ఇండియాలో తరచుగా రావాలని పేర్కొనడం.. రాజమౌళికి శంకర్ ఇచ్చిన గౌరవం. ‘2.0’కు విజువల్ ఎఫెక్ట్ అందిస్తున్న శ్రీనివాస్ మోహన్ (బాహుబలికి పని చేశాడు).. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ చెబుతున్న మాటలు చూస్తుంటే.. ఈ సినిమా విషయంలో శంకర్ అసలేమాత్రం రాజీ పడట్లేదట. ఏదీ ఒక పట్టాన ఒప్పుకోవట్లేదట. అన్నీ హై స్టాండర్డ్స్ లో ఉండాలని పట్టుబడుతున్నాడట.

క్వాలిటీ.. ఔట్ పుట్ విషయంలో శంకర్ అసాధారణమైన పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు కొంతవరకు కారణం రాజమౌళి అంటే అతిశయోక్తి లేదు. మొత్తానికి ‘బాహుబలి’తో రాజమౌళి.. శంకర్ మీద పాజిటివ్ ఎఫెక్టే చూపించాడు. ‘2.0’ను సాంకేతికంగా ‘బాహుబలి’ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శంకర్ ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు. ఆ సినిమాను చూశాక రాజమౌళి మరింత ఉన్నత ప్రమాణాలతో తన తర్వాతి సినిమాను తీయడానికి ప్రయత్నించొచ్చు. మొత్తానికి అంతిమంగా వీరి పోటీ ప్రేక్షకులకు గొప్ప సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తుందనడం మాత్రం వాస్తవం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/