Begin typing your search above and press return to search.

మగధీరకు ‘డబుల్’ ఝలక్

By:  Tupaki Desk   |   27 July 2015 2:26 PM GMT
మగధీరకు ‘డబుల్’ ఝలక్
X
ఆరేళ్ల కిందట మగధీర ప్రభంజనం చూసి తెలుగు పరిశ్రమ విస్తుపోయింది. పోకిరి టోటల్ కలెక్షన్ల రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే దాటేసిన రాజమౌళి సినిమా.. ఫుల్ రన్ లో రూ.76 కోట్ల షేర్ వసూలు చేసి టాలీవుడ్ రేంజిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఐతే ఇప్పుడు బాహుబలి ఆ సినిమాకు మూడు రెట్ల షేర్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల కావడం వల్లే బాహుబలి ఆ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోందని ఎవరైనా ఆ సినిమాను తగ్గించే ప్రయత్నం చేయడానికీ వీల్లేదు. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే మగధీర సాధించిందానికి రెట్టింపు షేర్ రాబట్టడం విశేషం.

థర్డ్ వీకెండ్ కూడా ముగిసేసరికి మొత్తం 17 రోజులకు బాహుబలి తెలుగు వెర్షన్ ప్రపంచ వ్యాప్త షేర్ రూ.152 కోట్లకు చేరుకోవడం విశేషం. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా ఇప్పటికే రూ.93 కోట్లు వసూలు చేసింది. ఫుల్ రన్ లో రూ.100 కోట్ల మార్కు అందుకోవడం ఖాయం. అన్ని వెర్షన్లూ కలుపుకుంటే బాహుబలి షేర్ ఇప్పటికే రూ.200 కోట్లకు దగ్గరగా ఉంది. రెండో వీకెండ్ తర్వాత వీక్ డేస్ లో బాహుబలి జోరు కొంచెం తగ్గినా.. మళ్లీ వీకెండ్ వచ్చేసరికి మునుపటి హవా కనిపించింది. తెలుగు వెర్షన్ వరకు దాదాపుగా అన్ని చోట్లా శని, ఆదివారాల్లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ సోమవారం నుంచి మళ్లీ కొంచెం జోరు తగ్గినా.. వీకెండ్ వచ్చేసరికి థియేటర్లు నిండటం ఖాయం. శ్రీమంతుడు వచ్చాకే బాహుబలి హవా తగ్గేలా కనిపిస్తోంది.