Begin typing your search above and press return to search.

బాహుబలిలో గ్రాఫిక్స్ తప్ప ఏం లేదా?

By:  Tupaki Desk   |   28 March 2016 11:00 PM IST
బాహుబలిలో గ్రాఫిక్స్ తప్ప ఏం లేదా?
X
బాహుబలి... ఎన్నో రికార్డులను తిరగరాసేసి, అందుకోలేని రికార్డులను సృష్టించేసి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసేసిన మహాద్భుత చిత్ర రాజం. వీటన్నిటికీ తోడు ఇప్పుడు జాతీయ ఉత్తమ చలన చిత్రంగా కూడా ఎంపిక కావడంతో టాలీవుడ్ జనాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. మరోవైపు కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఉత్తమ చిత్రంగా ఓ మూవీ ఎంపికైందంటే.. ఆ మూవీకి మరిన్ని కేటగిరీల్లోనూ పరస్కారాలు వస్తుంటాయి. ఇప్పటివరకూ ఇది ఆనవాయితీ. అసలు అలా పలు కీలక విభాగాల్లో డామినేట్ చేయడమే.. ఉత్తమ చిత్రానికి ఉండే అర్హత.

కానీ బాహుబలికి మాత్రం ఉత్తమ చిత్రం కాకుండా వచ్చిన మరో అవార్డు.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే. అంటే.. గ్రాఫిక్స్ తప్ప సినిమాలో మరేం లేనట్లే అని తేల్చేస్తున్నారు విశ్లేషకులు. అసలు టాలీవుడ్ సినిమాలకు నేషనల్ అవార్డులు రావడమే చాలా అరుదు. తమిళ - మళయాళ చిత్రాలకు కూడా అనేక సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి కానీ.. టాలీవుడ్ సినిమాలకు ఈ అర్హత దక్కించుకోలేకపోయాయి.

అలాంటప్పుడు ఓ చరిత్రకు నాంది పలికిందని సంతోషించడం మానేసి.. ఇలా విమర్శలకు దిగడం సరికాదనే మాట వినిపిస్తోంది. ఇది కరెక్టే అయినా.. గ్రాఫిక్స్ తప్ప ఏ కేటగిరిలోనూ దేశంలోనే పోటీ పడలేకపోయిన బాహుబలిని.. ఏకంగా ఆస్కార్ కి పంపించేయాలని.. బాహుబలి2తో ఆస్కార్ సాధించేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం అత్యాశే అనిపిస్తోంది.