Begin typing your search above and press return to search.

బాప్‌రే.. రిలీజ్‌ ముందే 300కోట్లు?

By:  Tupaki Desk   |   11 Jun 2015 3:30 PM GMT
బాప్‌రే.. రిలీజ్‌ ముందే 300కోట్లు?
X
ప్రస్తుతం ఏ నోట విన్నా బాహుబలి గురించిన చర్చే వినిపిస్తోంది. భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే సినిమా ఇదని ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి చెప్పిన లెక్కల ప్రకారం బాహుబలి రెండు భాగాల కోసం దాదాపు రూ.250కోట్లు ఖర్చయ్యింది. అంత పెద్ద మొత్తాన్ని తిరిగి రికవరీ చేయడం ఎలా? అయితే దేని లెక్కలు దానికి ఉన్నాయనే చెబుతున్నారంతా. ట్రేడ్‌ పండితుల విశ్లేషణ ప్రకారం .. ఈ సినిమా రిలీజ్‌కి ముందే 300కోట్లు వచ్చేశాయట. పదండి చూద్దాం.

తెలుగులో థియేట్రికల్‌ రిలీజ్‌ రూపంలో మొత్తం 140కోట్ల బిజినెస్‌ జరిగింది. అలాగే హిందీ, తమిళ్‌, మలయాళం మార్కెట్ల నుంచి డబ్బింగ్‌ హక్కుల రూపంలో 90కోట్ల వ్యాపారం పూర్తి చేశారు. శాటిలైట్‌ హక్కుల రూపంలో 50కోట్లు, ఆడియో హక్కులు, ఆడియో లాంచ్‌, యూట్యూబ్‌ హక్కులు అన్నీ కలుపుకుని 20కోట్లు వసూలు కానుంది. ఈ మొత్తం కలుపుకుని 'బాహుబలి : ది బిగినింగ్‌' రిలీజ్‌కి ముందే దాదాపు రూ.300కోట్ల బిజినెస్‌ పూర్తయిందని అంచనాలు వేస్తున్నారు. ఆడియో హక్కుల్ని రూ.3కోట్లకు లహరి మ్యూజిక్‌ చేజిక్కించుకుంది. తెలుగు, తమిళ్‌లో ఏ సినిమాకీ ఈ స్థాయిలో ఆడియో హక్కులకు చెల్లించిందే లేదు. ఆ లెక్కన బాహుబలి వ్యాపారం అన్ని భాషల్లోనూ సజావుగా సాగినట్టే. థియేటర్ల నుంచి ఆ మొత్తాల్ని రికవరీ చేసి పంపిణీదారులు, బయ్యర్లను సంతృప్తి పరిచేలా సినిమా ఉంటే సరిపోతుంది.

అయితే ఓ విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ 300కోట్ల సంపాదన కేవలం బాహుబలి తొలి భాగం వరకేనా? లేక రెండో భాగం కలుపుకునా? అన్నదాంట్లో స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ బాహుబలి పార్ట్‌ 2 వ్యాపారానికి సంబంధించిన లెక్కలు తేలాల్సి ఉంటే.. అది అదనపు లాభం కిందే లెక్కన్నమాట!