Begin typing your search above and press return to search.

రజినీ రాజ్యంలో బాహుబలి హవా

By:  Tupaki Desk   |   26 Jun 2015 11:11 AM IST
రజినీ రాజ్యంలో బాహుబలి హవా
X
సినీ అభిమానులకు సినిమా అనేది ఓ విందని అంటూవుంటారు. వీరోచితమైన యాక్షన్ సన్నివేశాలు, కళ్ళలో సుడులు తిరిగే సెంటిమెంట్ సన్నివేశాలు, పొట్ట చెక్కలయ్యేలా కామెడీ సీన్స్ ఇలా అన్నిరకాల భావోద్వేగాల మిశ్రమంలా వుండే సినిమాని విందు భోజనంతో పోల్చేది అందుకే.

శంకర్, రాజమౌళి లాంటి దర్శకుల సినిమాలైతే కనులకు మరింత పసందు. ఇంకా రెండు వారాలే మిగిలివుంది.. దృశ్యాల విందు ఆరగించేందుకు. దేశవ్యాప్తంగా కోట్లాది కళ్ళన్నీ దానికోసమే ఆవురావురుమని చూస్తున్నాయి. ఆ విందు పేరు బాహుబలి అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకోండి. అయితే మనదేశంతో పాటు జపాన్ వారూ ఈ విందుని ఆరగించడానికి ఎదురు చూస్తున్నారట. దక్షిణాది భాషలతో సహా దేశ వ్యాప్తంగా జూలై 10న బాహుబలి సినిమా విడుదల కానుంది. ఒక్కరోజు ఆలస్యంగా అంటే జూలై 11న జపాన్ లో ఈ సినిమా విడుదల కానుంది. జపాన్ వారు తమిళ సినిమాని బాగా రుచి మరిగారు. అందుకే ఈ సినిమా తమిళ వెర్షన్ అక్కడ విడుదల చేయనున్నారు. రజనీకి జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్, రాజమౌళిలకు అలానే ఫాన్స్ ఏర్పడతారేమో.