Begin typing your search above and press return to search.

బాహుబలీ.. కన్నడ సినిమాలేమైపోవాలి?

By:  Tupaki Desk   |   26 Jun 2015 10:59 AM IST
బాహుబలీ.. కన్నడ సినిమాలేమైపోవాలి?
X
వేరే భాషల సినిమాల అనువాదాలు కన్నడ ఇండస్ట్రీని నాశనం చేసేస్తున్నాయని.. డబ్బింగ్‌ సినిమాల్ని నిషేధించింది అక్కడి పరిశ్రమ. ఐతేనేం ఇప్పుడు వేరే భాషల సినిమాలు నేరుగా కర్ణాటకలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాల హవా అక్కడ మామూలుగా ఉండదు. మన స్టార్‌ హీరోల సినిమాలు రిలీజైనపుడు.. స్ట్రెయిట్‌ కన్నడ సినిమాలు రిలీజ్‌ చేయడానికి కూడా జంకుతుంటారు. మనోళ్ల సినిమాలకు ఆ స్థాయిలో హంగామా ఉంటుంది. ఈ మధ్య టెంపర్‌, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు కన్నడనాట భారీ స్థాయిలో రిలీజై.. భారీ వసూళ్లే దక్కించుకున్నాయి. మగధీర, అత్తారింటికి దారేది సినిమాలు కర్ణాటకలో ఏకంగా పది కోట్లకు పైగా షేర్‌ కలెక్ట్‌ చేసి ట్రేడ్‌ పండితుల్ని ఆశ్చర్యపరిచాయి.

ఐతే ఇప్పటిదాకా వచ్చిన తెలుగు సినిమాలన్నీ ఓ ఎత్తు. బాహుబలి మరో ఎత్తు కాబోతోంది. కర్ణాటక ఏరియాకు 'బాహుబలి' రైట్స్‌ను ఏకంగా రూ.18 కోట్లకు అమ్మారన్న వార్త సెన్సేషన్‌ అవుతోంది. సాధారణంగా మన స్టార్‌ హీరోల సినిమాలకు కర్ణాటకలో రూ.5-6 కోట్లకు మధ్య బిజినెస్‌ జరుగుతుంటుంది. ఇప్పటిదాకా పది కోట్ల మార్కును కూడా ఎవరూ అందుకోలేదు. అలాంటిది ఏకంగా రూ.18 కోట్లు పెట్టడమంటే మాటలు కాదు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో కూడా బాహుబలి బిజినెస్‌ ఇదే స్థాయిలో జరుగుతోంది. ఇది స్పెషల్‌ ఫిలిం అని.. తెలుగు సినిమాకున్న లిమిట్స్‌ అన్నీ దాటేయబోతోందని చెబుతున్న దిల్‌ రాజు నైజాం రైట్స్‌ను రూ.22.5 కోట్లకు కొన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటిదాకా నైజాం ఏరియా వరకు ఏ తెలుగు సినిమా కూడా 15 కోట్ల మార్కును కూడా అందుకున్నది లేదు.

దీన్ని బట్టే బాహుబలి క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలో స్ట్రెయిట్‌ సినిమాల స్థాయిలోనే బాహుబలి విడుదల కాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బెంగళూరులో విడుదల రోజు మరే సినిమాకు అవకాశం లేనంతగా మెజారిటీ థియేటర్లలో బాహుబలి ప్లాన్‌ చేస్తున్నారు. కలెక్షన్లలో రూ.20 కోట్ల మార్కును దాటడం పెద్ద విషయం కాదని అంటున్నారు. మరీ బాహుబలి ఈ స్థాయిలో విజృంభిస్తే కన్నడ సినిమాల పరిస్థితి ఏమవుతుందో మరి.